ముంబై మిస్సింగ్ లింక్ దెబ్బ: ప్రయాణికుల బాధలు వర్ణనాతీతం
మహారాష్ట్రలో కురుస్తున్న కుండపోత వర్షాలు ముంబై-పుణె ఎక్స్ ప్రెస్ వే ను పూర్తిగా అతలాకుతలం చేశాయి. ముంబై డివిజన్ పరిధిలోని కర్జత్ - లోనావాలా ఘాట్ సెక్షన్ మధ్య ఆదివారం రాత్రి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ రెండు నగరాల మధ్య రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్జత్ - లోనావాలా ఘాట్ పరిధిలోని ఠాకూర్‌వాడి, మంకీ హిల్ లూప్ క్యాబిన్ మధ్య అప్ మెయిన్ లైన్ పట్టాలపై భారీగా మట్టి పేరుకుపోయింది. ఈ మార్ంలో రాకపోకలను స్తంభించిపోయాయి.
ట్రాక్‌పై పడిన భారీ మట్టి, రాళ్లను తొలగించడానికి రైల్వే ఇంజనీర్లు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘాట్ ప్రాంతంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం వల్ల ఈ సహాయక పనులకు ఆటంకం కలుగుతోంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ రైల్వే అధికారులు 16 కీలక రైలు సర్వీసులను రద్దు చేశారు. రోడ్లపై కూడా పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో వేలాది మంది ప్రయాణికులు రైళ్ల రద్దు వార్తతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొండచరియలు విరిగిపడటం వల్ల మిస్సింగ్ లింక్ టన్నెల్ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ రూట్ లో వాహనాలన్నీ గంటల కొద్దీ నిలిచిపోయాయి.

ముంబై, పుణె నగరాల మధ్య రోజువారీ ఉపాధి పొందేవారు ఎక్కువగా ఉపయోగించే డెక్కన్ క్వీన్, సింహగఢ్ ఎక్స్‌ప్రెస్, ప్రగతి ఎక్స్‌ప్రెస్, డెక్కన్ ఎక్స్‌ప్రెస్, ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్ సహా మొత్తం 16 సర్వీసులను రద్దు చేశారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఈ ఆకస్మిక రద్దు వల్ల తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. ఇటు ధులే - ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ మధ్య నిరంతరం రాకపోకలు సాగించే మరో ఎక్స్‌ప్రెస్ సర్వీసును కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
అలాగే సుదూర ప్రాంతాల నుంచి మహారాష్ట్ర మీదుగా ప్రయాణించే తొమ్మిది ప్రధాన రైళ్లను కళ్యాణ్, ఇగత్‌పురి, మన్మాడ్, దౌండ్, భుసావల్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. వీటిలో సాధారణంగా బిజీగా ఉండే అహ్మదాబాద్-కొల్హాపూర్, ఇండోర్-దౌండ్ ఎక్స్‌ప్రెస్, అహ్మదాబాద్-పుణె దురంతో, హజూర్ సాహిబ్ నాందేడ్-పన్వేల్ వంటి ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. ఈ మార్గాల మార్పు వలన రైళ్లు తమ గమ్యస్థానాలకు చేరడం కొన్ని గంటల పాటు ఆలస్యం కానుంది.
22105 - సీఎస్ఎంటీ-పూణె ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్
12169- పూణె- సోలాపూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
12170- సోలాపూర్- పూణే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
22106 - పూణే-సీఎస్ఎంటీ ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్
12127- సీఎస్ఎంటీ- పుణె ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
12128- పూణే- సీఎస్ఎంటీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
11007- సీఎస్ఎంటీ- పుణె దక్కన్ ఎక్స్‌ప్రెస్
11008- పూణే- సీఎస్ఎంటీ దక్కన్ ఎక్స్‌ప్రెస్
12124- పూణే-సీఎస్ఎంటీ దక్కన్ క్వీన్
12123- సీఎస్ఎంటీ- పుణె దక్కన్ క్వీన్
12126 - పూణే-సీఎస్ఎంటీ ప్రగతి ఎక్స్‌ప్రెస్
12125 - సీఎస్ఎంటీ-పుణె ప్రగతి ఎక్స్‌ప్రెస్ రద్దయ్యాయి.
కుండపోత వర్షాల ప్రభావం కేవలం రైళ్లపైనే కాకుండా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా తీవ్రంగా పడింది. బలమైన ఈదురుగాలుల కారణంగా ఆదివారం ఎయిర్‌పోర్టు రన్‌వే కార్యకలాపాలను దాదాపు గంటసేపు పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల వల్ల ముంబైకి రావలసిన 13 ప్రధాన విమానాలను సమీప నగరాలకు మళ్లించారు. నాలుగు ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి.












Click it and Unblock the Notifications