విజయ్ కోసం నయీమ్ సెక్యూరిటీ: 100 మంది స్పెషల్ కమాండోలు
తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు (ఏప్రిల్ 23) సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయం సెగలు పుట్టిస్తోంది. అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే హోరాహోరీగా తలపడుతుండగా.. అందరి దృష్టి ఇప్పుడు 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత విజయ్ పైనే ఉంది. అయితే, విజయ్ తన ప్రచార పర్వంలో అనుసరిస్తున్న వ్యూహాలు ఒక ఎత్తయితే, ఆయన చుట్టూ ఉన్న భద్రతా వలయం ఇప్పుడు కోలీవుడ్ నుంచి కోట వరకు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఒక రహస్య సెక్యూరిటీ ఏజెన్సీ విజయ్ అడుగులను శాసిస్తుండటం సంచలనంగా మారింది.
గత నెలలో కరూర్‌లో జరిగిన బహిరంగ సభలో జనం ఒక్కసారిగా తోసుకురావడంతో భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తాయి. కేంద్ర ప్రభుత్వం వై-కేటగిరీ (Y-Category) భద్రత కల్పించినప్పటికీ, తనను అభిమానించే లక్షలాది మంది జనసమూహాన్ని నియంత్రించడం ప్రభుత్వ భద్రతతో సాధ్యం కాదని విజయ్ భావించారు. అందుకే, ఎక్కడా రాజీ పడకుండా దుబాయ్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ స్థాయి సెక్యూరిటీ సంస్థ 'జెంటూర్ సెక్యూరిటీ సొల్యూషన్స్' (Gentur Security) తో ఒప్పందం చేసుకున్నారు. కేరళకు చెందిన నయీమ్ మూస సారథ్యంలో నడిచే ఈ సంస్థ, హాలీవుడ్ యాక్షన్ స్టార్ల నుంచి గల్ఫ్ దేశాల వీవీఐపీల వరకు రక్షణ కల్పించడంలో దిట్ట.

'నయీమ్' అనుమతి లేనిదే అడుగు పడదు!
ఈ సెక్యూరిటీ ఏజెన్సీ పనితీరు ఎంత గోప్యంగా ఉందంటే.. టీవీకే పార్టీలో విజయ్ తర్వాత అంతటి కీలక నేతలుగా భావించే పుస్సీ ఆనంద్, వ్యూహకర్త ఆధవ్ అర్జున వంటి వారికి కూడా ఈ భద్రతా బృందం లోగుట్టు తెలియదట. చివరికి విజయ్ ని కలవాలన్నా సరే, నయీమ్ మూస అనుమతి తప్పనిసరి అని సమాచారం. ఇటీవల కేరళ ఎన్నికల్లో ఓటు వేయడానికి నయీమ్ వెళ్లినప్పుడు, విజయ్ ఏకంగా తన ఒక రోజు ప్రచారాన్ని రద్దు చేసుకోవడం ఆయనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. పార్టీ సీనియర్ నేతలు కూడా ఈ పరిణామంతో విస్మయానికి గురవుతున్నారు.
100 మంది స్పెషల్ కమాండోలు.. అత్యాధునిక నిఘా
ప్రస్తుతం విజయ్ ప్రచార సభల వద్ద సుమారు 100 మంది సుశిక్షితులైన ప్రైవేటు భద్రతా సిబ్బంది మోహరిస్తున్నారు. వీరంతా అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు, శాటిలైట్ ఫోన్లతో ఎప్పటికప్పుడు గుంపు నియంత్రణను (Crowd Control) పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా ప్రాంతంలో భద్రత సరిగ్గా లేదని ఈ బృందం భావిస్తే, వెంటనే ప్రచారాన్ని నిలిపివేస్తారు. విజయ్ గడప గడపకు ప్రచారం (Door-to-Door) చేస్తున్నప్పుడు కూడా ఈ బృందం ఒక అజేయమైన కోటలా ఆయన వెంట ఉంటోంది. ఈ అంతర్జాతీయ స్థాయి రక్షణ కోసం విజయ్ ప్రతి నెలా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
రాజకీయ యుద్ధంలో కొత్త వ్యూహం
విజయ్ పెరంబూరు నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో, ఆయనకు వ్యూహకర్త జాన్ ఆరోగ్యస్వామి మద్దతు ఇస్తున్నారు. అయితే, భౌతిక భద్రత బాధ్యతలను మాత్రం పూర్తిగా నయీమ్ మూస టీమ్‌కు అప్పగించారు. ప్రచారంలో భాగంగా విజయ్ కోలం వేయడం, ప్రజలతో నేరుగా మమేకమవ్వడం వంటి కార్యక్రమాలు చేస్తున్నా, ఈ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ మాత్రం 'గాలి కూడా చొరబడకుండా' నిఘా పెంచడం తమిళ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్‌కు తెరలేపింది.














Click it and Unblock the Notifications