మరో దిగ్గజ సంస్థలో 16వేల ఉద్యోగులపై వేటు..నెక్స్ట్ లిస్టులో..!!
ప్రపంచ స్థాయి సంస్థల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐటీ కంపెనీల్లో తరచూ కొనసాగుతున్న ఉద్యోగుల పై వేటు.. ఇప్పుడు ఆహార సంస్థలకు విస్తరించింది. స్విట్జర్లాండ్ ఆహార దిగ్గజ సంస్థ 'నెస్లే' భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. రానున్న రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. పొదుపు లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ప్రముఖ ఆహార దిగ్గజం నెస్లేలో ఏకంగా 16 వేల మంది ఉద్యోగుల పై వేటుకు సిద్దమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది. 'ప్రపంచం మారుతోంది.. దానికి తగ్గట్లే నెస్లే కూడా వేగంగా మారాల్సి ఉందని కంపెనీ సీఈవోగా గత నెల బాధ్యతలు చేపట్టిన ఫిలిప్ నవ్రాటిల్ పేర్కొన్నారు. ఇది కఠినమైన నిర్ణయమేనని పేర్కొన్న ఆయన.. అయితే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనన్నారు.

పొదుపు లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాల తొలగింపు బాధాకరమైన విషయమైనా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కార్యకలాపాలను క్రమబద్దీకరించడం కోసం ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం అవసరమని ఆయన చెప్పారు.
ఉద్యోగాల కోతలో భాగంగా 12,000 వైట్ కాలర్ ఉద్యోగాలను, మరో 4,000 ప్రొడక్షన్, సప్లై చైన్ విభాగాల్లోని ఉద్యోగాలను తగ్గించనున్నారు. ఈ నిర్ణయం ద్వారా కంపెనీకి ఒక బిలియన్ స్విస్ ఫ్రాంకుల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. అంతేగాక 2027 చివరి నాటికి తమ పొదుపు లక్ష్యాన్ని 2.5 బిలియన్ల నుంచి 3 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు పెంచుకుంటున్నట్లు నెస్లే వెల్లడించింది.
కాగా, సంస్థ గత తొమ్మిది నెలల ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే, నెస్లే అమ్మకాలు 1.9 శాతం తగ్గి 65.9 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు చేరాయి. ఇటీవలి కాలంలో కంపెనీలో అంతర్గత సమస్యలు, ఫ్రాన్స్‌లో బాటిల్ వాటర్ వివాదం వంటివి నెస్లే ప్రతిష్ఠను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం సైతం తిరిగి కోలుకోవటానికి దోహదం చేస్తుందని విశ్లేషణలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications