హుధుద్: తీర ప్రాంతంలో భయం, త్రివిధ దళాలు సిద్ధం

విశాఖపట్నం: హుధుద్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. శనివారం నాడు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విశాఖ మీదుగా వెళ్లే రైళ్లతో పాటు పలు రైళ్లు రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించనున్నారు. దారి మళ్లించే రైళ్లలో నీరు, ఆహారం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హుధుద్ పైన సమీక్ష నిర్వహించారు.

సమాచార వ్యవస్థ దెబ్బతినే అవకాశమున్నందున ఎనిమిది హెలికాప్టర్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. పర్యవేక్షణ కోసం ముగ్గురు అధికారులను అధనంగా నియమించారు. సహాయక చర్యల కోసం త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. విశాఖలో రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించనున్నారు. రంగంలోకి దిగేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉన్నాయి.

అంతకుముందు.. హుధుద్ శుక్రవారం మధ్యాహ్నానికి పెను తుఫానుగా మారింది. ఇది తీరం వైపుకు నెమ్మదిగా కదులుతోంది. ఈ తుఫాను తీరం వైపు నెమ్మదిగా కదులుతుండటంతో.. విపత్తు ఎక్కువగా ఉండవచ్చునని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. అన్ని ఓడ రేవుల్లో రెండో ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. సముద్రంలో వేటను నిషేధించారు. బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. హుధుద్ శుక్రవారం సాయంత్రానికి విశాఖకు 460 కిలోమీటర్ల దూరంలో ఉంది.

వాతావరణ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. సముద్రంలో అలలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి. ఈ పెను తుఫాను పెను ఉప్పెన సృష్టించే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తవచ్చునని చెప్పారు. తుఫాను తీరం తాకే సమయంలో రెండు నుండి మూడు మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడే అవకాశముందన్నారు. రేపు సాయంత్రం నుండే వర్షాలు పడే అవకాశముందని అధికారులు చెప్పారు.

తుఫాను బలహీన పడే అవకాశం లేదని, అలాగే దిశ మారే అవకాశం లేదని చెప్పారు. కాకినాడ, కళింగపట్నం, విశాఖలలో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రేపు సాయంత్రం నుండే వర్షాలు పడే అవకాశముందన్నారు. విశాఖలో అతి సమీపంలో ఆదివారం ఉదయం తీరం తాకవచ్చునని తెలిపారు. కాగా, హుధుద్ ఉప్పెన సృష్టించే అవకాశం ఉండటంతో తీర ప్రాంత వాసులుఆందోళన చెందుతున్నారు.

 Odisha, Andhra Pradesh brace for cyclone Hudhud

విశాఖకు సమీపంలో హుధుద్ తీరం దాటనుంది. అయితే, ఎక్కడ తీరం దాటుతుందో రేపు పూర్తి స్పష్టత రానుంది. హుధుద్ వల్ల కుంభవృష్టి కురుస్తుంది. సెల్ టవర్లు కూలే అవకాశముంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 126 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం చినరాజప్ప చెప్పారు. కేంద్రాల్లో ఆహారం, పాలు, నీళ్లు అన్ని ఇఉంచినట్లు చెప్పారు. చంద్రబాబు విజ్ఞప్తి మేరకు కేంద్రం నుండి 15ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. మంత్రులు, కలెక్టర్లతో చంద్రబాబు సమీక్షించారు.

13 మండలాల్లోని 118 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలో సముద్రంలో అలలు నాలుగు మీటర్ల మేర ఎగిసిపడుతున్నాయి. మూడు పడవల్లో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి రావాలని అధికారులు ఆదేశించారు. తీర ప్రాంతంలోని మరో మూడు పడవలు అలల తాకిడికి దెబ్బతిన్నాయి.

అంతకుముందు, హుధుద్ సైక్లోన్ విశాఖకు ఆగ్నేయదిశలో 530, గోపాలపుర్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరో పన్నెండు గంటల్లో పెను తుఫానుగా మారే అవకాశముందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం విశాఖ సమీపంలో తీరం దాటే అవకాశముంది. దీని ప్రభావం వల్ల శనివారం నుండి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో అతి భారీ, భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

హుధుద్ తీరం దాటే సమయంలో గంటకు 130-140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో అలలు రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశముంది. ఈ ప్రభావం వల్ల ఇళ్ల పైకప్పులు ఎగిరి పోవడం, విద్యుత్ స్తంభాలు విరగడం, రైలు, రోడ్డు మార్గాలు కొట్టుకు పోవడం, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశముంది. సముద్రంలో చేపల వేటను నిషేధిస్తూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఏపీ మంత్రులు జిల్లాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 25 రైల్వే స్టేషన్లలో అధికారులతో కూడిన రెస్క్టూ టీంలను సిద్ధం చేశారు. కోస్తా, ఉత్తరాంధ్రల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తమైంది. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఆహార పదార్థాలు తదితరాలను సిద్ధం చేశారు.

కాగా, పెద్దపెద్ద చెట్లను కూకటివేళ్లతో సహా పెకలించి వేస్తూ, కొండచరియలు విరిగిపడేలా చేస్తూ విద్యుత్‌, ఫోన్‌వైర్లను ధ్వంసం చేస్తూ అండమాన్‌ తీరాన హుధుద్ విధ్వంసం సృష్టించింది. బుధవారం విశాఖ తీరానికి 1000 కిలోమీటర్ల దూరాన సముద్రంలో ఉన్న ఈ తుఫాను.. గురువారం మధ్యాహ్నానికి విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 675 కిలోమీటర్ల దూరాన, గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 685 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమైంది.

శుక్రవారం ఉదయానికి విశాఖకు ఆగ్నేయదిశలో 590, గోపాలపుర్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో 610 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మంగళ, బుధవారాల్లో గంటకు 18 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో పరుగుపెట్టిన ఈ తుఫాన్‌.. గురువారం 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. అలా పశ్చిమ వాయవ్యంగా పయనించి శుక్రవారం ఉదయానికి తీవ్ర పెను తుఫాన్‌గా మారనుంది.

భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం తీవ్ర పెను తుఫాన్‌ తీరం దిశగా వచ్చే కొద్దీ దాని ప్రభావం కనిపిస్తుంది. దాని ప్రకారం.. శుక్రవారం (11) నుంచి ఉత్తర కోస్తా, తూర్పు గోదావరి జిల్లాల్లో వర్షాలు ప్రారంభమవుతాయి. శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి జిల్లా వరకూ, దక్షిణ ఒడిసాలో అనేక చోట్ల.. భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి. కోస్తాలో మిగిలిన జిల్లాల్లో విస్తారంగా, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.

కొన్ని ప్రాంతాల్లో 6.4 సెంటీమీటర్ల నుంచి 12.4 మేరకు వర్షం కురువొచ్చని, మరి కొన్ని ప్రాంతాల్లో 12.4 నుంచి 24 సెంటీమీటర్ల వర్షం కురువొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 24 సెంటీమీటర్లపైనే వర్షం కురువనుందని అంచనావేసింది.

శనివారం ఉదయం నుంచి ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలు, దక్షిణ ఒడిశాలో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60, ఒక్కొక్కసారి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. 12వ తేదీ (ఆదివారం) ఉదయం నుంచి 130 నుంచి 140, అప్పుడప్పుడు 155 కిలో మీటర్ల వేగంతో బలమైన పెనుగాలులు వీస్తాయి.

తీవ్ర పెను తుఫాన్‌ తీరం దాటే సమయంలో సముద్ర అలలు రెండు మీటర్ల (ఆరున్నర అడుగుల) ఎత్తు వరకూ ఎగసిపడతాయి. దీంతో ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాల్లో సముద్ర తీరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. కోస్తాలో అన్ని ఓడరేవుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. శుక్రవారం నుంచి ప్రమాద హెచ్చరికల తీవ్రతను మరింత పెంచనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+