ఒమిక్రాన్ కలకలం: గుజరాత్‌లో 2, మహారాష్ట్రలో 8 కొత్త కేసులు, దేశంలో 113కి చేరిక
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో వందకుపైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం గుజరాత్ రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు, మహారాష్ట్రలో 8 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 113కి చేరాయి.
Recommended Video
తాజా ఒమిక్రాన్ వేరియంట్ కేసులతో మహారాష్ట్రలో మొత్తం కొత్త వేరియంట్ కేసులు 40కి చేరాయి. శుక్రవారం పలు రాష్ట్రాల్లో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. దేశంలో కరోనా కేసులు నియంత్రణలోనే ఉన్నప్పటికీ.. ఒమిక్రాన్ కేసులు మాత్రం క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ శుక్రవారం మాట్లాడుతూ.. మీరు ప్రపంచవ్యాప్త డేటాను పరిశీలిస్తే, వ్యాక్సినేషన్ తర్వాత రోగులకు సోకిన ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. కానీ టీకా తర్వాత, ఇన్ఫెక్షన్ తీవ్రత చాలా తక్కువగా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.
కేంద్రం హెచ్చరికలు
కాగా, యూకే, ఫ్రాన్స్ దేశాల్లో ఒమిక్రాన్, కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అలాంటి పరిస్థితులు మనదేశంలో ఏర్పడితే రోజుకు లక్షలాది కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే పాల్ హెచ్చరించారు. యూకేలోని పరిస్థితి భారత్ లో గనుక ఏర్పడితే మన జనాభాను బట్టి రోజుకు 14 లక్షల కేసులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో రోజుకు 65 వేల చొప్పున కొత్త కేసులు వస్తున్నాయి. అక్కడి పరిస్థితులతో పోలీస్తే మన జనాభా దష్ట్యా భారత్ లో ప్రతి రోజుూ రోజుకు 13 లక్షల కేసులు నమోదవుతాయంటూ ఉదహరించారు. యూరప్ దేశాల్లో 80 శాతం మేర పాక్షికంగా వ్యాక్సినేషన్ పూర్తయినప్పటికీ.. డెల్టా ఉధృతి మాత్రం తగ్గడం లేదు. ఈ సమయంలోనే ఒమిక్రాన్ వేరియంట్ ఐరోపా దేశాలను వణికిస్తోంది.
ఈ క్రమంలోనే ప్రజలంతా అనవసర ప్రయాణాలు మానుకోవాలని పాల్ సూచించారు. వ్యాక్సిన్లు వేయించుకోవడం, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకలను కొద్ది మందితోనే జరుపుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గత 20 రోజులుగా మనదేశంలో 10వేల కన్నా తక్కువ కరోనా కేసులు వస్తున్నప్పటికీ.. ఇతర దేశాల్లో కరోనా వేరియంట్ల వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని మనమంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications