ఆసియాలోనే ది బెస్ట్ బీచ్.. గోవా బీచ్ సాధించిన సరికొత్త రికార్డు!
భారతీయ పర్యాటక రంగానికి అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత దక్కింది. మన దేశంలో బీచ్‌లకు నిలయమైన గోవా పర్యాటకం ప్రపంచ పటంలో మరోసారి సరికొత్త శిఖరానికి చేరింది. సుందర తీరాలకు ప్రసిద్ధి చెందిన సౌత్ గోవాలోని 'పాలోలెమ్ బీచ్' (Palolem Beach) ఆసియా ఖండంలోనే అత్యుత్తమ బీచ్‌గా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. 'బీచ్ డాట్ కామ్' ప్రకటించిన 'గ్లోబల్ బీచ్ ఇండెక్స్ 2026' నివేదికలో ప్రపంచవ్యాప్తంగా టాప్-10 ఉత్తమ తీరాలలో 6వ స్థానాన్ని దక్కించుకుని ఈ రికార్డు సృష్టించింది. అంతేకాదు, ప్రపంచంలోని అత్యుత్తమ 25 బీచ్‌ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక ఆసియా తీరంగా నిలిచి భారత పర్యాటక సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.
అర్ధచంద్రాకార తీరం.. మనసును దోచే ప్రశాంతత
సౌత్ గోవాలోని కాణకోణ తాలూకాలో ఉన్న ఈ పాలోలెమ్ బీచ్ ప్రత్యేకం అని చెప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సాధారణంగా గోవా బీచ్‌లు అంటే రద్దీ, హోరెత్తించే సౌండ్లు గుర్తొస్తాయి. కానీ ఈ బీచ్ మాత్రం తెల్లటి ఇసుక తిప్పలు, కొబ్బరి చెట్ల వరుసలు, అర్ధచంద్రాకారంలో ఉండే తీర ప్రాంతంతో పర్యాటకులకు సరికొత్త ప్రశాంతతను అందిస్తుంది. ఇక్కడి సముద్ర అలలు ఎంతో ప్రశాంతంగా ఉండటంతో ఈత కొట్టేందుకు, కయాకింగ్ చేసేందుకు పర్యాటకులు ఎంతో ఇష్టపడతారు. అంతేకాదు, బోటు ప్రయాణంలో సముద్రంలో ఎగిరిపడే డాల్ఫిన్లను చూడటం, సమీపంలోని మంకీ ఐలాండ్‌ను సందర్శించడం పర్యాటకులకు మరుపురాని అనుభవాన్ని అందిస్తుంది.

సైలెంట్ నాయిస్ పార్టీలు.. యోగా సెంటర్లు
కేవలం పగటిపూట విహారానికే కాకుండా, రాత్రివేళ వినోదానికి కూడా పాలోలెమ్ బీచ్ ప్రత్యేకం. ఇక్కడ నిర్వహించే 'సైలెంట్ నాయిస్ పార్టీలు' పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పెద్ద శబ్దాల మైకులు లేకుండా, హెడ్‌ఫోన్స్ ధరించి సంగీతాన్ని ఆస్వాదిస్తూ డాన్స్ చేయడం ఈ బీచ్ యొక్క ప్రత్యేకత. వీటితో పాటు తీరం వెంట ఉండే యోగా కేంద్రాలు, వెల్నెస్ రిట్రీట్లు, రుచికరమైన వంటకాలను అందించే కాఫేలు పర్యాటకులకు సంపూర్ణ మానసిక ప్రశాంతతను అందిస్తాయి. సమీపంలో ఉన్న అగోండా, పట్నేమ్ బీచ్‌లు కూడా ఈ ప్రాంతానికిదనపు ఆకర్షణగా నిలుస్తాయి.
అవార్డును ఎలా ఎంపిక చేశారంటే..
ప్రపంచవ్యాప్తంగా 322 తీరాలను పరిశీలించిన అనంతరం ఈ జాబితాను రూపొందించారు. సముద్ర నీటి పరిశుభ్రత, పర్యాటకుల సదుపాయాలు, భద్రత, వాతావరణం వంటి దాదాపు 18 కీలకమైన అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. 58 మంది అంతర్జాతీయ పర్యాటక నిపుణులు, కంటెంట్ క్రియేటర్ల అభిప్రాయాలతో పాటు దాదాపు 93 వేలకు పైగా గూగుల్ మ్యాప్స్ రివ్యూలు, శాటిలైట్ డేటాను విశ్లేషించి పాలోలెమ్ను ఆసియాలోనే నంబర్-1 బీచ్‌గా ప్రకటించారు. నవంబర్ నుంచి మార్చి వరకు ఈ బీచ్ సందర్శనకు అత్యుత్తమ సమయమని పర్యాటక వర్గాలు చెబుతున్నాయి.














Click it and Unblock the Notifications
