కేంద్రం న్యూ ఇయర్ గిఫ్ట్ - పెట్రో, డీజిల్ ధరల తగ్గింపు : ఎంతమేర..!!
కొత్త సంవత్సరం ప్రారంభం వేళ కేంద్రం కీలక ప్రకటించేందుకు సిద్దం అవుతోంది. సామాన్యులకు ఉపశమనం కలిగించేలా పెట్రో ఉత్పత్తుల ధరల తగ్గింపు పైన కసరత్తు చేస్తోంది. మూడు రాష్ట్రాల్లో విజయం తరువాత త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజలను ఆకర్షించే నిర్ణయాల పైన కేంద్రం ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా పెట్రో ధరల భారం తగ్గించేందుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. దీనికి సంబంధించి ఈ నెల 31న ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
తగ్గింపుపై కసరత్తు : సామాన్యులకు ఉపశమనం కలిగించే ప్రకటనకు రంగం సిద్దం అవుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ న్యూ ఇయర్ గిఫ్ట్ లో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గింపు దిశగా కేంద్రం నిర్ణయం ప్రకటించేందుకు సిద్దం అవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ కు రూ 6-10 తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ధరల తగ్గింపుకు సంబంధించిన ప్రతిపాదనలకు పెట్రోలియం శాఖ అధికారులు ప్రధాని మోదీ ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తోంది. ఈ ధరల సవరణ పైన ప్రభుత్వం నుంచి ఇంకా ప్రకటన వెలువడలేదు. కొద్ది నెలలుగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రో ధరలను తగ్గించలేదు, పెంచలేదు.

ఎన్నికల వేళ నిర్ణయం : గత ఆర్దిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు పెరగటంతో రిటైల్ కంపెనీలు ఈ ధరల భారాన్ని ప్రజలపై వేసాయి. ఆ సమయంలో ధరలు పెరిగాయి. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గినా ఆ మేరకు రిటైల్ అమ్మకం ధరలను సంస్థలు తగ్గించలేదు. దీంతో, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్లు ప్రస్తుత ఆర్దిక సంవత్సర తొలి ఆరు నెలల్లో ఏకంగా రూ 58,198 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. చివరిసారిగా 2022 మే 22వ తేదీన కేంద్రం పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో లీటర్ ధర రూ 8, లీటర్ డీజిల్ ధర రూ 6కి తగ్గింది.

ఉపశమనం కలిగించేనా : కొద్ది నెలలుగా పలు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా ధరల పెంపు పైన నిర్ణయం తీసుకోలేదు. ఇక, మార్చి లేదా ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. వరుసగా మూడో సారి కేంద్రంలో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కేంద్రంలోని ముఖ్య నేతలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజాకర్షక నిర్ణయాల పైన కసరత్తు చేస్తున్నారు. భారీగా పెరిగిన పెట్రో ధరలను తగ్గించటం ద్వారా కొంత మేర ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో, న్యూ ఇయర్ గిఫ్ట్ గా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పైన ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. ఇదే జరిగితే సామాన్యలకు ఉపశమనం దక్కనుంది.












Click it and Unblock the Notifications