వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి ఎన్నికలు: ఎవరి ఇబ్బందులు వారివే, కేసీఆర్ యూటర్న్?

ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఎన్డీయే అభ్యర్థి విజయం కూడా నల్లేరు మీద నడకేమీ కాకపోయినా.. కొద్ది మెజారిటీ సాధించగలిగితే చాలు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూడిల్లీ: ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారసుడి ఎంపికకు దేశ రాజధాని 'హస్తిన'లో సంప్రదింపుల కోలాహాలం మొదలైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ తదుపరి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న విషయమై గుంభనంగా వ్యవహరిస్తుండగా, విపక్షాలు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ సారథ్యంలో చర్చల ప్రక్రియ ప్రారంభించాయి.
అధికారంలో ఉన్న ఎన్డీయే అభ్యర్థికి పోటీగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ దూకుడుగా ముందుకు వెళుతున్న తరుణంలో విపక్షాలు తమ భవిష్యత్, దేశ ప్రగతికి ఆలవాలమైన లౌకిక విధానానికి ముప్పు వాటిల్లిందని భావిస్తున్నాయి.

ప్రత్యేకించి సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ, త్రుణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ తదితర పార్టీలు ఉమ్మడిగా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నాయి.

బీజేపీ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

బీజేపీ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఎన్డీయే అభ్యర్థి విజయం కూడా నల్లేరు మీద నడకేమీ కాకపోయినా.. కొద్ది మెజారిటీ సాధించగలిగితే చాలు. ఎన్టీయే అభ్యర్థిగా జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరు ఎక్కువగా వినిపిస్తున్నది. గతంలో ఆమె ఒడిశాలో బీజేడీ - బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా పనిచేశారు. ఒడిశాలో పేరొందిన గిరిజన నాయకురాలు. వచ్చే ఎన్నికల్లో గిరిజన ఓట్లు పొందేందుకు బీజేపీ.. అమిత్ షా - మోదీ జోడీ చేసే ప్రయత్నాల్లో భాగంగా ముర్ము అభ్యర్థిత్వానికి మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.

రాష్ట్రప్రగతికి మద్దతునిచ్చే వారికే

రాష్ట్రప్రగతికి మద్దతునిచ్చే వారికే

2014 ఎన్నికల్లో గెలుపొందినప్పటి నుంచి ఎన్డీయే మిత్రపక్షం కాకున్నా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నాయకత్వం రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నదన్న విషయం సందేహస్పదంగా మారింది. లోక్ సభలో ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. తెలంగాణ ప్రగతికి మద్దతునిచ్చే వారికే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతునిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి పైనే ఆధారపడి ఉన్నదని కూడా జితేందర్ రెడ్డి చెప్పారు.

ఎంపీ కల్వకుంట్ల కవిత నర్మగర్భ వ్యాఖ్యలు

ఎంపీ కల్వకుంట్ల కవిత నర్మగర్భ వ్యాఖ్యలు

అయితే ఎన్డీయేకు మద్దతునిస్తారా? విపక్షాలకు చేయూతనిస్తారా? అన్న విషయం టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి చెప్పలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు కూడగట్టేందుకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ప్రయోగిస్తున్నదన్న శరద్ యాదవ్ ఆరోపణను జితేందర్ రెడ్డి కొట్టి పారేశారు. కాకపోతే జయలలిత మరణం తర్వాత అధికారంలో ఉన్నా.. అన్నాడీఎంకే నేతలను ఆదాయం పన్ను, ఎన్ ఫోర్స్ మెంట్, ఢిల్లీ సీఐడీ అధికారుల సాయంతో కేంద్రం ముప్పు తిప్పలు పెడుతోంది. మోదీ సర్కార్‌పై విమర్శలు చేయొద్దని తమిళనాడు సీఎం ఈ పళనిసామి హెచ్చరికలు జారీ చేశారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతుపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని, పార్టీ అధినేత కేసీఆర్ దే తుది నిర్ణయమన్నారు.

2014 ఎన్నికల ప్రచారంలో మోదీ అలా

2014 ఎన్నికల ప్రచారంలో మోదీ అలా

వాస్తవంగా తెలంగాణ ఏర్పాటు కోసం బీజేపీ మద్దతు పలికినా 2014 ఎన్నికల ప్రచారంలో ‘ప్రసవం చేయమంటే తల్లి ప్రాణాలకు ముప్పు తెచ్చారు (తెలంగాణను విడగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు తెచ్చారు)' అని ప్రస్తుత ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కొలువు దీరిన వెంటనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనంచేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. తర్వాత తెలంగాణకు ఎయిమ్స్ ఇస్తామని అప్పటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ ప్రకటించారు. కానీ ఆచరణలో ఇటీవల బడ్జెట్ సమావేశాల సమయంలో టీఆర్ఎస్ నిరసన తెలియజేస్తే ఆర్థిక మంత్రి జైట్లీ ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటన మాత్రం చేశారు. నిధుల కేటాయింపు, స్థల పరిశీలన తదితర కార్యక్రమాలు చేపట్టనే లేదు.

తుది నిర్ణయం కేసీఆర్‌దే

తుది నిర్ణయం కేసీఆర్‌దే

శుష్క ప్రియమైన ప్రశంసలు మినహా రాష్ట్ర ప్రగతికి అవసరమైన పథకాల అమలులో ప్రత్యేకించి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం వెనుకబడి ఉన్నదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా మిర్చి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించడం కూడా నామమాత్రంగానే మిగిలిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే టీఆర్ఎస్ లోక్ సభ సభ్యుడు.. రాష్ట్ర ప్రగతికి అనుకూలమైన వారికే మద్దతు అని పరోక్షంగా ఎన్డీయే పక్షమన్న పరోక్ష సంకేతాలిచ్చారు. దీనిపై తుది నిర్ణయం మాత్రం తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌దేనన్నది నగ్న సత్యం. ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్రమోడీ ప్రభుత్వం కేసీఆర్ ఘర్షణకు దిగే సాహసం చేస్తారా? అన్నదీ అనుమానమేనని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతునిస్తున్న వారితో కలిసి మొత్తం లోక్ సభలో 15 మంది, రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు.

వేగవంతమైన విపక్షం సంప్రదింపులు

వేగవంతమైన విపక్షం సంప్రదింపులు

ఇదిలా ఉంటే రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసుకునేందుకు అధికార, విపక్ష పార్టీలు ఎవరికి వారు సంప్రదింపులు తీవ్రతరం చేశాయి. విపక్ష పార్టీల నేతల పరిశీలనతో జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ప్రతిపక్ష నేతల పరిశీలనలో ఉన్నవారిలో శరద్ యాదవ్‌‌కు మద్దతు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. రాజ్యాంగ విలువలను కాపాడగలిగే సామర్థ్యం ఆయనకు ఉన్నట్లు కొందరు చెప్తున్నారు. కానీ శరద్ యాదవ్ ఒక టీవీ చానెల్ తో మాట్లాడుతూ అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదని, విపక్షాల మధ్య ఐక్యతే ప్రధానమని తేల్చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో సంప్రదింపులు జరుపుతారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సోనియాగాంధీ.. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి అభ్యర్థి ఎవరనే అంశంపై ఓ నిర్ణయం జరగలేదు.

2019 లోక్ సభ ఎన్నికల్లో మహా కూటమి ఇలా

2019 లోక్ సభ ఎన్నికల్లో మహా కూటమి ఇలా

ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చొరవ తీసుకున్నారు. జనతా దళ్ యునైటెడ్ అగ్ర నేత శరద్ యాదవ్, ఆ పార్టీ మరో అగ్ర నేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఇటీవలే సోనియాతో భేటీ అయ్యారు. జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. అదేవిధంగా ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, సీపీఐ నేత డి. రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా సోనియాతో చర్చలు జరిపారు. రాష్ట్రపతి ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థిని నిలపగలిగితే 2019 లోక్‌సభ ఎన్నికల సమయానికి మహా కూటమిని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే విపక్షాల కూటమికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా సారథ్యం వహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే విధంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ కూటమికి కన్వీనర్ గా వ్యవహరిస్తారని మీడియాలో వార్తలొచ్చాయి.

ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంకూ ఆశలు

ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంకూ ఆశలు

దేశ రాజకీయాల్లో మందగమనంలో ఉన్న ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, ఎస్‌పీ మార్గదర్శకుడు ములాయం సింగ్ యాదవ్‌ తమ మనసులో రాష్ట్రపతి పదవిపై ఆశలు పెట్టుకుని ఉంటారని కొందరు అంటున్నారు. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ గతంలో మోదీ ప్రభుత్వంపై మెతక వైఖరిని అవలంబించినప్పటికీ, ఇటీవల ప్రతిపక్షాలతో కలిసేందుకు ప్రయత్నిస్తోంది. జేడీయూ అగ్రనేత శరద్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలంటే ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించడం ఒక్కటే సరైన మార్గమని తెలిపారు. సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీలను ఏక తాటిపైకి తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన, అకాలీదళ్ పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పడం గమనార్హం.

English summary
The Opposition is slowly getting united under the chairmanship of Sonia Gandhi. In what can be seen as a precursor of the Opposition unity before 2019 general elections, JD-U chief Nitish Kumar is made the convenor of the front.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X