బడ్జెట్‌కు ముందే కేంద్రం తీపికబురు: వాటి ధరలు తగ్గింపు
Commercial LPG Cylinder Price: వంటగ్యాస్ వినియోగదారులకు స్వల్పంగా ఊరట లభించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు నామమాత్రంగా తగ్గాయి. సిలిండర్ ఒక్కింటికి ఏడు రూపాయలు తగ్గింది. తగ్గిన ఈ ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. నెల రోజుల వ్యవధిలో కేంద్రం వంటగ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించడం ఇది రెండోసారి. జనవరి 1వ తేదీన ఒక్కో సిలిండర్‌పై రూ.14.50 పైసల మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వాటి రేట్లు తగ్గుముఖం పట్టాయి.

డిసెంబర్ 1వ తేదీ వరకూ కూడా కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు వరుసగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. వరుసగా అయిదు నెలల పాటు అంటే- ఆగస్టు నుంచి డిసెంబర్ వరకూ ప్రతినెలా ఒకటో తేదీన వీటి రేట్లు పెరుగుతూ వచ్చాయి. వాటని సవరిస్తూ ఉత్తర్వులను జారీ చేస్తూ వస్తోన్నాయి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.
ఈ అయిదు నెలల వ్యవధిలో అదనంగా రూ. 172.50 పైసలను అదనంగా చెల్లించాల్సి వచ్చింది వినియోగదారులకు. ఆగస్టులో ఒక్కో సిలిండర్ మీద రూ.8.50 పైసలు, సెప్టెంబర్ 1వ తేదీన 39 రూపాయలు, అక్టోబర్‌లో 48.50 పైసలు, నవంబర్‌లో ఏకంగా 62 రూపాయలు, డిసెంబర్‌లో రూ.16.50 పైసల చొప్పున పెంచాయి.
తాజా నిర్ణయంతో దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు 1,797 రూపాయలకు తగ్గింది. నిన్నటి వరకు ఈ ధర 1,804 రూపాయలుగా ఉండేది. కోల్‌కతలో రూ. 1,911.50 పైసల నుంచి రూ.1,907.50 పైసలకు తగ్గింది. ముంబైలో రూ. 1,756 నుంచి 1,749 రూపాయలు, చెన్నైలో 1,966.50 పైసల నుంచి 1,959 రూపాయలకు తగ్గింది.
గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఒక్కో సిలిండర్ ధర 803 రూపాయలు. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పంపిణీ చేసే గృహావసర వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో సబ్సిడీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో గ్యాస్ కనెక్షన్‌పై 200 రూపాయల సబ్సిడీని ఇచ్చింది.












Click it and Unblock the Notifications