Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాహుల్ ద్రవిడ్: ప్రజల మధ్యలో కూర్చున్నా భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌ను ఏ ఒక్కరూ గుర్తుపట్టనప్పుడు..

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హోరాహోరీగా సాగుతోంది. ఈ సమయంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, తన కోసం కొంత సమయం కేటాయించుకోవడంతో పాటు మైదానం వెలుపల జరిగే వివిధ ఈవెంట్లకు హాజరవుతూ గడుపుతున్నారు. తాజాగా ఇలాంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్న ద్రవిడ్, తన సహజ స్వభావంతో అందరినీ ఆశ్చర్యపరిచారు.

పుస్తకావిష్కరణలో రాహుల్ ద్రావిడ్

మాజీ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్ రచించిన 'రిస్ట్ అష్యూర్డ్' అనే పుస్తక ఆవిష్కరణ బెంగళూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో గుండప్ప విశ్వనాథ్, ప్రముఖ రచయిత రామచంద్ర గుహ కూడా పాల్గొన్నారు.

కాసేపటికే అక్కడికి రాహుల్ ద్రవిడ్ వచ్చారు. పక్కనే ఉన్న రామచంద్ర గుహను పలకరించి, చివరి వరుసలో ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ఆయన మాస్క్ ధరించి ఉండటంతో అక్కడున్న ఎవరికీ ఆయనే 'రాహుల్ ద్రవిడ్' అనే విషయం తెలియలేదు. ఆయన పక్కన కూర్చున్న యువతి కూడా ఆయనను గుర్తు పట్టలేదు.

రాహుల్ ద్రవిడ్

తర్వాత గుండప్ప విశ్వనాథ్ వచ్చి రాహుల్ ద్రవిడ్‌ను పలకరించడంతో అందరికీ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోయారు.

రాహుల్ ద్రవిడ్ వినయం, సింప్లిసిటీ గురించి వినయ్‌కాశీ అనే ఖాతాదారు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఘటన ట్విటర్ సహా మిగతా అన్ని సామాజికమాధ్యమాల్లో షేర్ అవుతోంది. చాలామంది ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

https://twitter.com/vinaykashy/status/1523610437308149760

90వ దశకం చివర్లో 2000-2011 మధ్య కాలంలో భారత క్రికెట్ జట్టు ఏదైనా మ్యాచ్‌లో ఇబ్బంది పడినప్పుడల్లా ప్రేక్షకులు రాహుల్ ద్రవిడ్ ఆట కోసం వేచి చూసేవారు.

భారత్‌కు అప్పుడు చాలా మంది గొప్ప బ్యాట్స్‌మెన్ ఉన్నారు. కానీ, క్రికెట్ అభిమానులందరికీ మిగతా బ్యాట్స్‌మెన్ కంటే రాహుల్ ద్రవిడ్‌పై దృఢ నమ్మకం ఉండేది. జట్టును పరాజయం నుంచి గట్టెక్కిస్తాడని, లేదంటే మ్యాచ్‌ను తిరిగి భారత్ వైపు తిప్పుతాడని అభిమానులు భావించేవారు.

రెండు ఫార్మాట్లలో 10,000 పైగా పరుగులు

రాహుల్ ద్రవిడ్ 164 టెస్టుల్లో 13,288 పరుగులు, 344 వన్డేల్లో 10,889 పరుగులు సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో రెండు ఫార్మాట్లలో పదివేల పరుగులు సాధించిన కొద్ది మంది క్రికెటర్లలో ఆయన కూడా ఒకరు.

ద్రవిడ్ ఖాతాలో మరో రికార్డు కూడా ఉంది. వికెట్ కీపింగ్‌తో పాటు టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా ద్రవిడ్ ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన 164 టెస్టుల్లో 210 క్యాచ్‌లు అందుకున్నారు.

వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు ఆయన. బ్యాటింగ్‌లో దుర్భేద్యమైన డిఫెన్స్ టెక్నిక్ కారణంగా రాహుల్ ద్రవిడ్‌ను ముద్దుగా 'ది వాల్' అని పిలిచేవారు.

రాహుల్ ద్రవిడ్ వ్యక్తిత్వం, స్వభావం, ఆటకు సంబంధించిన ఆసక్తికర అంశాలను ఆయన గురించి బాగా తెలిసిన జర్నలిస్టులు, తోటి ఆటగాళ్లు, క్రికెటర్లు బీబీసీతో పంచుకున్నారు.

రాహుల్ ద్రవిడ్

ద్రవిడ్ ఆటలో మార్పు

రాహుల్ ద్రవిడ్ కెరీర్ తొలినాళ్ల గురించి సీనియర్ జర్నలిస్ట్ విజయ్ లోకపల్లి మాట్లాడారు. ''కెరీర్ ప్రారంభంలో ఆయనను అందరూ డిఫెన్సివ్ బ్యాట్స్‌మన్ అని పిలిచేవారు. తర్వాత తన బ్యాటింగ్ స్టయిల్‌లో రాహుల్ మార్పులు చేసుకున్నారు. అందుకే ఆయన వన్డే క్రికెట్‌లో కూడా ఎక్కువ పరుగులు చేయగలిగారు. రాహుల్ ద్రవిడ్ గురించి తలుచుకోగానే... నిస్వార్థమైన, సొంత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించే ఆటగాడిగా నాకు ఆయన కనిపిస్తారు. ఆయన క్రికెట్‌కు చేసిన సేవలతో పోలిస్తే తగినంత గౌరవం ఆయనకు దక్కలేదని అనిపిస్తోంది'' విజయ్ అభిప్రాయపడ్డారు.

మైదానం వెలుపల రాహుల్ ద్రవిడ్ ఎలా ఉంటారు?

మైదానంలో రాహుల్ ద్రవిడ్ ఒక మంచి ఆటగాడు. జెంటిల్మెన్ ఆఫ్ క్రికెట్. మైదానంలో ఎప్పుడూ ఆవేశపడిన సందర్భాలు లేవు. ఎందరో జూనియర్ క్రికెటర్లకు ఆయన ఆదర్శం. కానీ, మైదానం బయట రాహుల్ ఎలా ఉంటారు?

వెంకటేశ్ ప్రసాద్, రాహుల్ ద్రవిడ్ ఎన్నో ఏళ్ల పాటు కర్ణాటక, భారత జట్టు తరఫున ఆడారు. ''నేను కలిసిన క్రికెటర్లలో రాహుల్ అత్యంత నిజాయతీ కలిగిన వాడు. లార్డ్స్‌లో తొలి టెస్టు ఆడిన సమయంలోనే నేను ఇది గుర్తించా. ఆయన చాలా శాంతంగా ఉంటారు. క్రికెట్ లేనప్పుడు పుస్తకాలు చదువుతారు'' అని వెంకటేశ్ ప్రసాద్ తెలిపారు.

ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, సచిన్

రోలర్ కోస్టర్ అంటే చాలా భయం

''ప్రారంభంలో ద్రవిడ్ కన్నడ ఎక్కువ మాట్లాడేవారు కాదు. తర్వాత ఆ భాషలో చాలా మెరుగయ్యారు. ఒకసారి మేం క్రికెట్ సిరీస్ ఆడేందుకు విదేశాలకు వెళ్లాం. అప్పుడు అక్కడ రోలర్ కోస్టర్ రైడ్ చేయాలంటే చాలా భయపడ్డారు. 'ఈ రైడ్‌ను అలన్ డోనాల్డ్ వేసే ఫాస్ట్ బాల్‌లాగా ఊహించుకో.. అప్పుడు ఇది చాలా సులభంగా అనిపిస్తుంది నేను ఆయనకు నచ్చజెప్పా'' అని ప్రసాద్ అప్పటి ఘటనను నవ్వుతూ గుర్తు చేసుకున్నారు.

సూపర్ స్టార్ అంటే ఒప్పుకోరు..

భారత క్రికెట్ గురించి రాసే వేదం జైశంకర్ మాట్లాడుతూ ''ద్రవిడ్‌కు ఆట అంటే విపరీతమైన అభిమానం. ఆట తర్వాత ఆయనకు ఎక్కువగా నచ్చేవి పుస్తకాలు'' అని అన్నారు.

''ఆ మధ్య ఒకసారి సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ద్రవిడ్ ఆ ఎగ్జిబిషన్‌కు వెళ్లారు. లైన్‌లో తన కుమారునితో కలిసి నిల్చొని తన వంతు వచ్చేవరకు ఎదురుచూస్తున్నారు. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. కానీ, ఇదే రాహుల్ అసలైన స్వభావం. ఆయన ఎల్లప్పుడూ నిరాడంబరంగా ఉంటారు. ప్రజలు ఆయనను 'సూపర్ స్టార్' అని పిలుస్తారు. కానీ, ఆయన తనను తానెప్పుడూ సూపర్ స్టార్‌లా పరిగణించుకోరు'' అని జైశంకర్ చెప్పుకొచ్చారు.

''హీరో అనే పదాన్ని చాలా జాగ్రత్తగా వాడాలని, కేవలం సైనికులు, శాస్త్రవేత్తలు, వైద్యులకే ఆ పదం సరిపోతుందని ద్రవిడ్ భావిస్తారని'' ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో ద్రవిడ్ క్రికెట్ జీవితంపై ప్రచురించిన 'టైమ్‌లెస్ స్టీల్' అనే పుస్తకంలో ఆయన భార్య విజేత చెప్పారు.

లక్ష్మణ్, ద్రవిడ్

డాక్టరేట్‌ తిరస్కరణ

2017లో బెంగళూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ఆఫర్ చేయగా ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించారు. క్రికెట్‌లో రీసెర్చ్ చేసిన తర్వాతే డాక్టరేట్ తీసుకుంటా అని వారికి చెప్పారు.

బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ద్రవిడ్ మాట్లాడుతూ... ''వైఫల్యం గురించి మాట్లాడేందుకు నాకు పూర్తి అర్హత ఉంది. నేను 604 మ్యాచ్‌లు ఆడాను. కానీ, అందులో 410 మ్యాచుల్లో 50 పరుగులకు మించి స్కోర్ చేయలేకపోయాను'' అని అన్నారు.

రాహుల్ ద్రవిడ్‌ అంటే మంచి డిఫెన్స్, కెప్టెన్సీ, ఆకర్షణీయమైన బ్యాటింగ్ స్టైల్, నిస్వార్థ స్పూర్తితో పాటు నిరాడంబరత కూడా. ఈ లక్షణం గురించి మాట్లాడుకోకపోతే ఆయన గుర్తింపు అసంపూర్ణంగా ఉంటుంది అని ఆయన గురించి బాగా తెలిసిన వారు అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+