మా డిప్యూటీ సీఎం 10th క్లాస్ పాస్ అయ్యాడంటే.. డౌటే
ఉప ముఖ్యమంత్రి విద్యార్హతలపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. తాను పదో తరగతి పాస్ అయినట్లు ఎక్కడే గానీ అధికారికంగా పొందుపర్చకపోవడం చర్చనీయాంశమౌతోంది. ఆయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో కూడా దీని ప్రస్తావన లేకపోవడం.. ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఆయనపై రాజకీయ విమర్శలకు ఇది తెరతీసినట్టయింది. వీటికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇదివరకే వెల్లడైంది. అధికార జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ మహాకూటమి హోరాహోరీగా ప్రచారం సాగిస్తోన్నాయి. ఈ రెండు కూటములతో సంబంధం లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచింది ప్రశాంత్ కిశోర్ కు చెందిన జన్ సురాజ్ పార్టీ.

ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌదరి ఇటీవలే నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్ ను దాఖలు చేశారు. తారాపూర్ నుంచి ఆయన పోటీ చేస్తోన్నారు. ఈ అఫిడవిట్ లో ఆయన పొందుపరిచిన అంశాలపై ప్రముఖ వ్యూహకర్త, జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కొత్త సందేహాలను లేవనెత్తారు. సామ్రాట్ చౌదరి విద్యార్హతలకు సంబంధించిన వివరాలు ఇందులో స్పష్టంగా లేవని ఆరోపించారు.
10వ తరగతి ఎప్పుడు పాస్ అయ్యారని అడిగిన ప్రతీసారీ కూడా ఆ విషయం ఎన్నికల అఫిడవిట్‌లో ఉంటుందని సామ్రాట్ చౌదరి దాటవేస్తూ వచ్చారని ప్రశాంత్ కిశోర్ గుర్తు చేశారు. తీరా ఆ అఫిడవిట్ లో దీన్ని ఎక్కడే గానీ ప్రస్తావించలేదని అన్నారు. ఈ అఫిడవిట్ మొత్తం చదివానని, అందులో 10వ తరగతి ఎప్పుడు పాస్ అయ్యారో ఎక్కడా లేదని వివరించారు. కామరాజ్ యూనివర్శిటీలో ప్రీ-ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసినట్లు గతంలో చెప్పుకొన్నారని, ఈ కోర్సు తమిళం మాట్లాడే వారికి మాత్రమే ఉద్దేశించినదని పేర్కొన్నారు.
10వ తరగతి పాస్ అయ్యారా లేదా అనే దానిపై సామ్రాట్ చౌదరి ఇంకా స్పష్టత ఇవ్వలేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే విద్యార్హతలపై గతంలో చేసిన ప్రకటనలన్నీ కూడా అవాస్తమేనని భావించాల్సి ఉంటుందని చెప్పారు. బాధ్యతాయుత పదవిలో ఉంటూ కోట్లాదిమంది బీహార్ ప్రజలను ఆయన మోసం చేశాడని, నిజంగా పదో తరగతి పాస్ అయివుంటే ఈ విషయాన్ని అఫిడవిట్ లో ఎందుకు రాయలేదని అన్నారు.












Click it and Unblock the Notifications