Ratan Tata Love story: రతన్ టాటా లవ్‌స్టోరీ ఎందుకు సక్సెస్ కాలేదు..?
Ratan Tata Love story:రతన్ టాటా... ఓ గొప్ప పారిశ్రామికవేత్త. ప్రపంచంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. రతన్ టాటా మరణవార్తతో యావత్ ప్రపంచం నిర్ఘాంతపోయింది. ఎనిమిది పదుల వయసులోనూ నిర్విరామంగా పనిచేసిన వ్యక్తి రతన్ టాటా. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ నలుమూలల విస్తరించడంతో పాటు.. దేశం పట్ల ఆయన బాధ్యతను ఎన్నడూ మరువలేదు. ఇంతమందికి ఆదర్శంగా నిలిచిన రతన్ టాటా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది చాలామందిలో తలెత్తుతున్న ప్రశ్న. ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అసలు రతన్ టాటా ఎందుకు పెళ్లి చేసుకోలేదు.. ఆయన జీవితంలో కూడా ఏదైనా ప్రేమకథ ఉందా..?
రతన్ టాటా జీవిత చరిత్ర తెలుసుకోండి..!
రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. కొన్ని లక్షల కోట్లకు అధిపతి.అయితే ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఎందుకు మిగిలిపోయారనేది చాలామందిని తొలుస్తున్న ప్రశ్న. రతన్ టాటాకు పిల్లను ఎవరు ఇవ్వరు చెప్పండి. కానీ ఆయన పెళ్లికి మాత్రం దూరంగా ఉన్నారు.రతన్ టాటా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆయన జీవితంలో కూడా ఒక లవ్ స్టోరీ ఉంది. అయితే ఆ ప్రేమకథ ప్రారంభమై చిగురించలేదు. అందుకు చాలా కారణాలున్నాయి. రతన్ టాటా ప్రేమించిన అమ్మాయి అమెరికాలో ఉండేది. అక్కడే వీరి ప్రేమ చిగురించింది. ఇక తన ప్రేమ కథ గురించి ఈ బిజినెస్ టైకూన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

రతన్ టాటా లవ్ స్టోరీ:
అపర కుబేరుడు టాటా గ్రూప్ అధినేత రతన్ టాటాకు ఓ క్యూట్ లవ్ స్టోరీ ఉంది. ఆయన లాస్ ఏంజిల్స్‌లో ఓ కంపెనీలో పనిచేస్తున్నప్పడు ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ చిగురిస్తున్న సమయంలో రతన్ టాటా అమ్మమ్మ అనారోగ్యంతో మంచాన పడ్డప్పడు టాటా భారత్‌కు తిరిగి వచ్చారు.తనతో పాటు తన ప్రియురాలు కూడా భారత్‌కు వస్తుందని భావించిన రతన్ టాటాకు నిరాశే ఎదురైంది.ఇక భారత్‌కు వచ్చిన తర్వాత 1962లో భారత్ -చైనా మధ్య యుద్ధం జరిగింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను భారత్‌కు పంపేందుకు ఇష్టపడలేదు.దీంతో రతన్ టాటా లవ్‌స్టోరీకి ఎండ్ కార్డు పడింది. ఈ జ్ఞాపకాలతోనే బ్రహ్మచారిగా జీవితాంతం ఉండిపోయారు.
రతన్ టాటా దాతృత్వం:
రతన్ టాటా ప్రేమ విఫలమైనప్పటికీ...జీవితంలో ఒక వ్యక్తిగా గెలిచాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాపింప చేయడంలో సక్సెస్ అయ్యారు. ప్రపంచ విపణిలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంలో విజయం సాధించారు. బిజినెస్ కమ్యూనిటీలో టాటా గ్రూప్ పేరు వింటే టక్కున రతన్ టాటానే గుర్తు వచ్చేలా తన ముద్ర వేశారు. కేవలం బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు.. రతన్ టాటా దాతృత్వం కలిగిన వ్యక్తి. తన గ్రూప్‌లో పనిచేసే చిరు ఉద్యోగిని కూడా సొంత కుటుంబ సభ్యులుగానే చూస్తారు. ఇదే ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుతుంది. ఇక ఆయన ఎన్నో ఎన్జీఓలకు జంతు సంరక్షణ కేంద్రాలకు భారీ విరాళాలు ఇచ్చారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళించినప్పుడు ఆయన చేసిన సహాయం మరువలేనిది.












Click it and Unblock the Notifications