ఐదేళ్ల తర్వాత రెపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. కారణం ఏంటంటే ?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ ప్రజలకు తీపి కబురు చెప్పింది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీలో దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రెపో రేటును 25 బేస్ పాయింట్స్ తగ్గిస్తున్నట్టు ఏకగ్రీవంగా నిర్ణయం చేశామని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. 5 ఏళ్ల తర్వాత ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో రెపోరేటు 6.25%గా నిర్ణయించబడింది.
మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత.. సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ హోదాలో ఆయనకు ఇది మొదటి ద్రవ్య విధాన కమిటీ సమావేశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కొనసాగుతోందని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పురోగతి కాస్తా ఆగిపోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు.

రెపో రేటు తగ్గింపుతో బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణాలు పొందనున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంకులు కస్టమర్లకు అందించే రుణాలపై కూడా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముందని తెలుస్తోంది. హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్ పై ఈ ఎఫెక్ట్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి ఊరట కలిగనుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ నిర్ణయం దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఏ విధమైన ప్రభావం చూపుతుందోనని చర్చ నడుస్తోంది.
ఇక మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటు నిర్ణయ ప్యానెల్ 2026 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిని దాదాపు 6.7%గా ఉంటుందని అంచనా వేసిందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అలాగే 2026 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 4.2% వద్ద కొనసాగుతుందని అంచనా వేసినట్టు స్పష్టం చేశారు.
రెపో రేటు అంటే..
రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. ఇది రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్ గా పరిగణించబడుతోంది. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణాలు పొందుతాయి. బ్యాంకులకు నిధులు తక్కువగా ఉన్నప్పుడు ఇలా చేస్తుంటాయి. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది.












Click it and Unblock the Notifications