సారాకు సచిన్ పైలట్ విడాకులు: ఎన్నికల అఫిడవిట్‌లో వెలుగులోకి, ఆస్తులు ఎంతంటే?
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తన రెండు దశాబ్దాల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. తన సతీమణి సారా అబ్దుల్లాతో సచిన్ పైలట్ విడిపోయారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సచిన్ పైలట్ దాఖలు చేసిన ఎన్నికల అపిడవిట్‌లో ఈ వివరాలు పొందుపర్చడంతో విడాకుల విషయం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ (Rajasthan) అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సచిన్ పైలట్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.
టోంక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో 'స్పౌజ్' అనే ఆప్షన్ వద్ద డివోర్స్ అని పేర్కొనడంతో అంతా షాకయ్యారు. సచిన్ పైలట్ 2004లో సారా అబ్దుల్లాను వివాహం చేసుకున్నారు. సారా.. జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కుమార్తె కావడంతో అప్పట్లో వీరి వివాహం ఓ హాట్ టాపిక్‌గా మారింది. వీరికి ఇద్దరు కుమారులు అరాన్, విహాన్ ఉన్నారు.

కుమారులిద్దరూ ప్రస్తుతానికి తనపై ఆధారపడి ఉన్నారని సచిన్ పైలట్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా, సచిన్, సారా విడిపోయినట్లు తొమ్మిదేళ్ల కిందటే వదంతులు వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అలాంటి వార్తలు జోరుగా ప్రచారం కావడంతో వాటిని ఖండించారు. ఆ తర్వాత 2018 డిసెంబర్‌లో సచిన్ పైలట్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి ఫరూక్ అబ్దుల్లా, సారా, అరాన్, విహాన్‌లు హాజరయ్యారు.
తాజాగా, అఫిడవిట్ వెలుగులోకి రావడంతో మరోసారి సచిన్ పైలట్ దంపతుల విడాకుల అంశంపై చర్చ జరుగుతోంది. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనడంతో విడాకులు నిజమేనని తెలుస్తోంది.
కాగా, సచిన్ పైలట్ ఆస్తుల విషయానికొస్తే.. గత ఐదేళ్లలో రెట్టింపు అయ్యాయి. 2018 ఆయన మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 3.8 కోట్లు కాగా.. తాజా అఫిడవిట్‌లో తన ఆస్తులను రూ. 7.5 కోట్లని పేర్కొన్నారు.
#BREAKING : Former Deputy Chief Minister of Rajasthan Sachin Pilot divorced Sara Abdullah. In an election affidavit, Sachin revealed that he is 'divorced'. #SachinPilot #SaraAbdullah #Congress #Tonk #Rajasthan pic.twitter.com/g2Ib2vMyAo
— Vikas Lohchab (@TheVikasLohchab) October 31, 2023
కాగా, రాజస్థాన్ రాష్ట్రంలో నవంబర్ 25న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3 ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. ఎన్నికల దగ్గరపడుతున్న క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.












Click it and Unblock the Notifications