డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు; 75డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు, ఈ పాస్ పోర్ట్ సేవలు: నిర్మలా బడ్జెట్ విశేషాలు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈసారి చేనేత చీరలోనే బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ రాబోయే 25 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ను రూపొందించామని నిర్మల సీతారామన్ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఘడియల్లో ఉన్నామని, మరో 25 సంవత్సరాల విజన్ తో తమ ప్రభుత్వం బడ్జెట్ ను రూపొందించిందని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ తో పునాది వేశామని నిర్మలమ్మ తెలిపారు.

బడ్జెట్ రూపొందించటంలో నాలుగు ప్రధాన సూత్రాలను చెప్పిన నిర్మలా సీతారామన్
నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇందులో ముఖ్యంగా ప్రధాని గతిశక్తి యోజన సమీకృత అభివృద్ధి, అభివృద్ధి ఆధారిత ఉపాధి, ఉద్యోగ కల్పనపరిశ్రమలకు ఆర్థిక ఊతం, పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్, ఈ నాలుగు అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం అని అన్నారు. ఇప్పటికే వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలను ఇస్తామని ప్రకటించిన నిర్మలాసీతారామన్, దేశాన్ని డిజిటల్ విధానంలో నడిపించడానికి తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు.

డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం, డిజిటల్ ఎకానమీని ప్రమోట్ చేస్తాం
కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన నిర్మల సీతారామన్, తాజా పరిణామాల నేపథ్యంలో, అవసరాన్ని బట్టి డిజిటల్ యూనివర్సిటీ స్థాపించనున్నట్టుగా వెల్లడించారు. పీఎం విద్య కార్యక్రమంలో భాగంగా 200 టీవీ ఛానల్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. డిజిటల్ ఎకానమీని ప్రమోట్ చేస్తున్నట్లు వివరించిన నిర్మలా సీతారామన్ ఇటీవలి కాలంలో డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల ట్రెండ్ పెరిగిపోయిందని వెల్లడించారు.

75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభిస్తాం
కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహిస్తూ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించనున్నదని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.ఇవన్నీ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయని , సామాన్య ప్రజలు దీని నుండి ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారని నిర్మల సీతారామన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Recommended Video

1486 పనికిరాని చట్టాల రద్దు; ఈ పాస్ పోర్ట్ జారీ
ఇక ఇదే సమయంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి 1486 పనికిరాని చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. దేశ ప్రజల సౌకర్యాన్ని పెంచేందుకు 2022-2023 లో ఈ పాస్ పోర్ట్ లను జారీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ కోసం ఓపెన్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.దీని ద్వారా, ఆరోగ్య ప్రదాతలకు డిజిటల్ రిజిస్ట్రీలు, ప్రత్యేకమైన ఆరోగ్య గుర్తింపులు మరియు ఆరోగ్య సౌకర్యాలకు సార్వత్రిక ప్రాప్యత సాధించబడుతుందని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications