Snakes Video: బెడ్‌రూమ్ ఏసీలో ఐదు పాములు.. ఒళ్ళు గగుర్పొడిచే ఘటన.
వేసవి వస్తోందంటే చాలు.. ఏసీల వినియోగం పెరుగుతుంది. అయితే, ఏసీ కేవలం చల్లని గాలినే కాదు, ఒక్కోసారి ఊహించని భయాన్ని కూడా మోసుకొస్తుందని కేరళలో జరిగిన ఈ ఘటన నిరూపించింది. బెడ్‌రూమ్‌లో హాయిగా నిద్రపోదామనుకున్న ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తన ఏసీ యూనిట్‌లో ఏకంగా ఐదు పాములు దర్శనమివ్వడం స్థానికంగా పెను కలకలం రేపింది.
కేరళ రాజధాని తిరువనంతపురంలోని టెక్నోపార్క్‌లో పనిచేసే మాధవ్ పణిక్కర్ అనే వ్యక్తికి బుధవారం రాత్రి ఒక వింత అనుభవం ఎదురైంది. తన బెడ్‌రూమ్ గోడకు ఉన్న ఏసీ యూనిట్ నుంచి ఏదో వింత ఆకారం బయటకు పొడుచుకు వచ్చినట్లు ఆయన గమనించారు. అనుమానం వచ్చి టార్చ్ లైట్ వేసి చూడగా, ఏసీ లోపల ఏదో కదులుతున్నట్లు కనిపించింది. తీరా నిశితంగా పరిశీలిస్తే అవి పాములని తెలిసి ఆయన గుండె ఆగినంత పనైంది.

రెస్క్యూ టీమ్ ఎంట్రీ.. ఏసీలో పాముల వేట!
వెంటనే అప్రమత్తమైన మాధవ్, అటవీ శాఖకు సమాచారం అందించారు. రెస్క్యూ టీమ్ వాలంటీర్ గౌతమ్ మురళి ఘటనా స్థలానికి చేరుకుని ఏసీ యూనిట్‌ను జాగ్రత్తగా విప్పి చూడగా, లోపల ఏకంగా ఐదు పాములు చుట్టలు చుట్టుకుని ఉన్నాయి. ఇవి విషరహితమైన 'బ్రాంజ్‌బ్యాక్' (Bronzeback) జాతికి చెందిన పాములని, వీటిని స్థానికంగా 'విల్లూన్ని' అని పిలుస్తారని అధికారులు గుర్తించారు. గంటల తరబడి శ్రమించి నాలుగు పాములను సురక్షితంగా పట్టుకోగా, ఒకటి మాత్రం గోడ రంధ్రం గుండా తప్పించుకుంది.
పాములు లోపలికి ఎలా వచ్చాయి?
సాధారణంగా ఏసీ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అవుట్‌లెట్ పైపుల కోసం గోడకు పెద్ద రంధ్రాలు చేస్తారు. ఆ రంధ్రం చుట్టూ ఉన్న గ్యాప్‌ను సరిగ్గా మూసివేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తేల్చారు. పైగా, ఆ ఇంటి బాల్కనీ వైపు చెట్టు కొమ్మలు వంగి ఉండటంతో, పాములు సులువుగా చెట్టు పైనుంచి ఏసీ పైపుల మార్గం ద్వారా లోపలికి ప్రవేశించాయి. ఏసీ లోపల ఉండే చల్లదనం, తేమ పాములకు అనువైన స్థావరంగా మారడంతో అవి అక్కడే తిష్ట వేశాయి.
ఏసీ వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఈ ఘటన నేపథ్యంలో అధికారులు కొన్ని కీలక సూచనలు చేశారు. ఏసీ అవుట్‌లెట్ పైపులు గోడ గుండా వెళ్లే చోట ఎటువంటి ఖాళీలు లేకుండా సీల్ చేయాలని, ఏసీ యూనిట్ వద్దకు చెట్టు కొమ్మలు రాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ముఖ్యంగా పాతబడిన లేదా రంధ్రాలు ఉన్న ఏసీ యూనిట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం ప్రాణాపాయం నుంచి రక్షిస్తుందని సూచించారు.
ബെഡ്റൂമിലെ എയർ കണ്ടിഷനകത്ത് പാമ്പുകൾ! | snake
— DD News Malayalam (@DDNewsMalayalam) March 5, 2026
തിരുവനന്തപുരം ശ്രീകാര്യം സ്വദേശി മാധവ് ജെ പണിക്കരുടെ ബെഡ്റൂമിലെ എയർ കണ്ടീഷനകത്താണ് 5-ഓളം പാമ്പുകളെ കണ്ടത്. സ്നേക്ക് റസ്ക്യൂ ടീം സ്ഥലത്തെത്തി പാമ്പിനെ പിടികൂടി.#thiruvananthapuram #snake #keralanews pic.twitter.com/LZce5cJhLd












Click it and Unblock the Notifications