సిద్దూ, డీకే శివకుమార్ ఛలో ఢిల్లీ, 20 మందిలో లక్కీ లీడర్స్ ఎవరు, బెంగళూరుకు ?
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మంత్రి పదవులు ఆశిస్తున్న సీనియర్ ఎమ్మెల్యేలు పదవుల కోసం తహతహలాడుతున్నారు. తమకు మంత్రి పదవులు ఇవ్వాలని సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీద సీనియర్ ఎమ్మెల్యేలు ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది.
సీనియర్ ఎమ్మెల్యేల ఒత్తిడి ఎక్కువ కావడంతో ఈ రోజు (బుధవారం) సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ బయలుదేరుతున్నారు. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకి మేము ఢిల్లీ వస్తున్నాము సార్ అంటూ సమాచారం ఇచ్చిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ మంత్రి పదవులు ఎవ్వరికి ఇవ్వాలి అనే జాబితాను సిద్దం చేసుకుని ఢిల్లీ బయలుదేరారు.

గత శనివారం సీఎంగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేసే సమయంలోనే 20 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. అయితే శనివారం ఉదయం సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో పాటు 8 మంది మంత్రులు మాత్రమే ప్రమాణస్వీకారం చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మంత్రి పదవులు ఆశపడుతున్న నాయకులు ఎవరు ?, వారి చరిత్ర ఏమిటి అని పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాత ఓ నిర్ణయం తీసుకోవాలని, ఎవరికంటే వాళ్లకు మంత్రి పదవులు ఇస్తే తరువాత ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ కొంచెం వెనుకడుగు వేసిందని తెలిసింది.

కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖార్గే ఏఐసీసీ అధ్యక్ష పదవిలో ఉండటంతో మంత్రి పదవులు ఆశపడుతున్న వారి జాతకాలను కాంగ్రెస్ పార్టీ తెప్పించుకుందని తెలిసింది. మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాల తదితరులతో చర్చించి మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలని డిసైడ్ చేస్తారని తెలిసింది.
మంత్రి పదవులు ఆశపడుతున్న నాయకులు:బీకే, హరిప్రసాద్ (ఎమ్మెల్సీ), ఆర్ వీ, దేశ్‌పాండే, బెంగళూరు ఎం కృష్ణప్ప, కృష్ణ బైరేగౌడ, బైరతి సురేష్, దినేష్ గుండూరావు, మధు బంగారప్ప, శివానంద పాటిల్, శివరాజ్ తంగడగి, కేఎన్ రాజన్న, బసవరాజ రాయరెడ్డి, లక్ష్మీ హెబ్బాల్కర్, లక్ష్మణ్ సవది, రాఘవేంద్ర నాల్ హిట్, హెచ్‌కే. పాటిల్, రహీమ్ ఖాన్, హెచ్ సీ మహదేవప్ప, ఈశ్వర్ ఖండ్రే, చెలువరాయ స్వామి, ఎస్ఎస్. మల్లికార్జున్, వినయ్ కులకర్ణి, సంతోష్ లాడ్, సలీమ్ అహమ్మద్ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎన్ని మంత్రి పదువులు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, మంత్రి పదవుల్లో ఉండే ఆ లక్కీ నాయకులు ఎవరు అని గురువారం తెలిసిపోతుంది.












Click it and Unblock the Notifications