ఎక్కడో పాకిస్తాన్ బార్డర్ లో పుట్టి- సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్..!!
సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా చరిత్ర సృష్టించారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ లో పురుష సైనికులతో కూడిన దళానికి నాయకత్వం వహించి ఘనత సాధించారు. పారామిలిటరీ బలగాల చరిత్రలో ఓ మహిళ.. పూర్తిగా పురుష సైనికుల బృందానికి సారథ్యం వహించడం ఇదే మొదటిసారి. ఈ అరుదైన అవకాశం ఆమెకు లభించింది. న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన ఈ కవాతులో 26 ఏళ్ల సిమ్రాన్ బాలా 147 మంది సైనికులతో కూడిన దళాన్ని నడిపించారు.
దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ దళమైన సీఆర్పీఎఫ్ కు చెందిన ఈ బృందం 'దేశ్ కే హమ్ హై రక్షక్' అనే గీతాన్ని ఆలపిస్తూ పరేడ్ లో పాల్గొంది. మహిళా సీఆర్పీఎఫ్ అధికారులు గతంలో కవాతులకు సారథ్యం వహించినా, పూర్తిగా పురుష సైనికులతో కూడిన దళానికి ఒక మహిళ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. ఈ పరేడ్ మొత్తానికీ సిమ్రన్ బాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళా శక్తికి నిలువుటద్దం అయ్యారు.

సిమ్రన్ బాలా స్వగ్రామం.. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా. అత్యంత సమస్యాత్మక, సున్నితమైన నౌషేరా పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ రేఖ నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ గ్రామం. గతంలో ఇక్కడ సరిహద్దు కాల్పులు చాలా జరిగాయి. సరిహద్దుల్లో కాల్పులు జరిగినప్పుడు ఆమె గ్రామం ఖాళీ అయ్యేది. అక్కడి వారిని జవాన్లు సురక్షిత ప్రాంతాలకు తరలించేవాళ్లు. అటువంటి చోటి నుంచి వచ్చారు సిమ్రన్ బాలా.
రాజౌరీ జిల్లా నుండి అధికారి స్థాయి ర్యాంకులో ఈ అతిపెద్ద పారామిలిటరీ దళంలో చేరిన మొదటి మహిళగా సిమ్రాన్ బాలా గుర్తింపు పొందారు. ముగ్గురు తోబుట్టువుల్లో సిమ్రాన్ చిన్నవాళ్లు. ఆమె తాత, తండ్రి సైన్యంలో పనిచేశారు. జమ్మూలోని గాంధీనగర్ ప్రభుత్వ మహిళా కళాశాల నుండి రాజకీయ శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ఏప్రిల్ 2025లో సీఆర్పీఎఫ్ లో చేరారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తరియా బెటాలియన్‌లో తన మొదటి పోస్టింగ్‌లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
దాదాపు 3.25 లక్షల జవాన్ల సామర్థ్యం ఉన్న సీఆర్పీఎఫ్.. దేశంలోనే అత్యంత కీలక అంతర్గత భద్రతా దళం. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక దాడులు, ఈశాన్య రాష్ట్రాలలో తిరుగుబాటు వ్యతిరేక విధులు వంటివి దీని ప్రధాన కార్యకలాపాల్లో ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు దఅక్కడి పరిస్థితులను నియంత్రించాల్సిన బాధ్యత సీఆర్పీఎఫ్ దే. అటువంటి దళానికి రిపబ్లిక్ డే పరేడ్ లో నాయకత్వాన్ని వహించడం పట్ల సిమ్రన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications