విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత
వెండితెరపై కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించే 'దళపతి' విజయ్, ఇప్పుడు తన నిజ జీవితంలో ఒక ఊహించని సంక్షోభంలో చిక్కుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని నడిపిస్తున్న ఈ స్టార్ హీరోపై, ఆయన భార్య సంగీత చేసిన ఆరోపణలు ఇప్పుడు తమిళనాట పెను తుఫానును సృష్టించాయి. "కోట్లు సంపాదించే నా భర్త ఇంట్లో నాకు చోటు లేదు.. నేను చెన్నై వీధుల్లో నిరాశ్రయురాలిని అయ్యాను" అంటూ సంగీత కోర్టు మెట్లెక్కడం ఇటు సినీ వర్గాలను, అటు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
గత కొంతకాలంగా విజయ్ దంపతులు విడిపోతున్నారనే వార్తలు షికారు చేస్తున్నా, అవి కేవలం పుకార్లేనని అభిమానులు ఆశపడ్డారు. కానీ, చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో సంగీత దాఖలు చేసిన పిటిషన్ ఆ ఆశలపై నీళ్లు చల్లింది. "బ్రిటన్ పౌరసత్వం ఉన్న నాకు చెన్నైలో సొంత ఇల్లు లేదు. లండన్ నుంచి వచ్చినప్పుడు నేను ఉండటానికి నా భర్త నిరాకరిస్తున్నారు. చెన్నై నీలంకరైలోని మా ఇంట్లోకి నన్ను రానివ్వడం లేదు" అని ఆమె పేర్కొన్నారు. ఆ నివాసంలో తనకు సగం వాటా ఉందని, విడాకుల కేసు తేలే వరకు తనను ఆ ఇంటి నుంచి వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని ఆమె తెగేసి చెప్పారు.

ముదురుతున్న విడాకుల వివాదం!
నిజానికి వీరిద్దరి మధ్య గొడవలు నిన్న మొన్నటివి కావు. విజయ్ తల్లిదండ్రులతో సంగీతకు ఉన్న విభేదాలు, విజయ్ రాజకీయ ప్రవేశం విషయంలో ఆమెను దూరం పెట్టడం వంటివి ఈ బంధంలో బీటలు వారేలా చేశాయి. విజయ్ నటించిన సినిమాల వేడుకలకు, ఆయన పార్టీ ఆవిర్భావ సభలకు సంగీత గైర్హాజరు కావడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఏకంగా "నన్ను నా ఇంట్లోకి రానివ్వడం లేదు" అని భార్య బహిరంగంగా ఆరోపించడంతో, విజయ్ వ్యక్తిగత ప్రతిష్ఠకు భారీగా గండి పడే అవకాశం కనిపిస్తోంది.
రాజకీయ వ్యూహం దెబ్బతింటుందా?
ప్రజలకు అండగా ఉంటానని, మహిళా భద్రత గురించి మాట్లాడే విజయ్.. తన సొంత భార్యనే ఇంట్లోకి రానివ్వడం లేదన్న వార్త ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. "సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని వాడు రాష్ట్రాన్ని ఏం ఏలుతాడు?" అనే విమర్శలు అప్పుడే మొదలయ్యాయి. అగ్ర హీరోగా వెలుగుతున్న తరుణంలో, ఈ కుటుంబ కలహాలు విజయ్ రాజకీయ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తాయోనని అభిమానులు టెన్షన్‌లో ఉన్నారు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? విజయ్ దీనిపై మౌనం వీడుతారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్!












Click it and Unblock the Notifications