దినకరన్ కు భారీ దెబ్బ: గిఫ్ట్, డబ్బులు ఇస్తూ అడ్డంగా, పరుగో పరుగు !
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ అనుచరులు ఓటర్లకు నగదు, బహుమతులు పంచిపెడుతూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. ఇక మావల్ల కాదంటూ దినకరన్ అనుచరులు పోలీసులకు భయపడి ఆందోళన.
చెన్నై: ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ వర్గానికి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆర్ కే నగర్ నియోజక వర్గంలోని ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్న దినకరన్ అనుచరులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆర్ కే నగర్ నియోజక వర్గంలో దినకరన్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఎలాగైనా ఉప ఎన్నికల్లో గెలవాలని దినకరన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

శశికళ వర్గంపై ప్రతిపక్షాల కన్ను
టీటీవీ దినకరన్ ఓ పక్క ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులు తన మీద దృష్టి పెట్టే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న తన మీద అధికారులు నిఘా వేసేలా చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం దినకరన్ అనుచరుల మీద కన్ను వేశారు.

పన్నీర్ వర్గం అసలు టార్గెట్ దినకరన్
అన్నాడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్థిని పన్నీర్ సెల్వం వర్గీయులు టార్గెట్ చేసుకున్నారు. ఎలాగైన శశికళ వర్గం ఎత్తులను అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎప్పటికప్పుడు దినకరన్ అనుచరుల కార్యకలాపాలు గుర్తించి ఎన్నికల కమిషన్ కు సమాచారం ఇస్తున్నారు.

ఎన్నిక కమిషన్ అధికారులు
శనివారం అన్నాడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్థి దినకరన్ అనుచరులు ఆర్ కే నగర్ ఓటర్లను మభ్యపెడుతూ వారికి బహుమతులు, నగదు పంపిణి చేశారు. ఈ విషయం గుర్తించిన పన్నీర్ సెల్వం వర్గం, డీఎంకే పార్టీతో సహ ఇతర పార్టీల నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

దినకరన్ అనుచరులు అడ్డంగా బుక్కయ్యారు
శనివారం ఆర్ కే నగర్ నియోజక వర్గంలో ఓటర్లకు నగదు, బహుమతులు పంచిపెడుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదు, బహుమతులు పంచిపెడుతున్న వారిని టీటీవీ దినకరన్ అనుచరులు శివకుమార్, ప్రసన్న అని గుర్తించామని ప్రత్యేక స్క్వాడ్ అధికారులు మీడియాకు చెప్పారు.

సీఎం అయిపోవాలని దినకరన్ ప్లాన్
ఓటర్లకు డబ్బు పంచిపెడుతున్న దినకరన్ అనుచరుడు కరుణమూర్తిని శుక్రవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు దినకరన్ అనుచరులు మరో ఇద్దరు అరెస్టు అయ్యారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన తరువాత జైల్లో ఉన్న చిన్నమ్మ శశికళ ఆశీస్సులతో సీఎం అయిపోవాలని దినకరన్ కలలు కంటున్నాడు. కనీసం ఉప ముఖ్యమంత్రి అయ్యి తమిళనాడు ప్రభుత్వంలో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారు.

ఎవరైనా ఓకే, దినకరన్ మాత్రం నో
తమిళనాడులో అధికారంలో ఉన్న శశికళ వర్గంలోని ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని నిరూపించాలని, అందుకు ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ ను ఓడించి చిన్నమ్మ వర్గానికి చావుదెబ్బ కొట్లాలని పన్నీర్ సెల్వం వర్గం భావించింది. దినకరన్ ఓటమికే వీరు ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు.

దినకరన్ సెల్ఫ్ గోల్
ఆర్ కే నగర్ ఓటర్లకు ఎంత డబ్బు అయినా పంచిపెట్టాలని, ఎలాగైనా ఇక్కడి నుంచి తాను గెలవాలని దినకరన్ ప్రయత్నిస్తున్నారు. అయితే అతని అనుచరులు డబ్బులు పంచిపెడుతూ ఎన్నికల అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు.

పరుగో పరుగు
పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిస్తారని ఆందోళనతో దినకరన్ అనుచరులు ఇప్పుడు నగదు, బహుమతులు పంచిపెట్టడానికి ముందుకురాకుండా భయంతో పరుగు తీస్తున్నారు. ఇప్పుడు దినకరన్ అనుచరులు అయోమయంలో పడిపోయారు.












Click it and Unblock the Notifications