సీఈసీతో పాటు టార్గెట్ అవుతున్న సుప్రీం..! ఇద్దరు జడ్జీల వ్యాఖ్యలతో..!
కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలపై ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం తర్వాత సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను విపక్షాలతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో ఆయన మిగతా ఎన్నికల కమిషనర్లతో కలిసి తాజాగా భేటీ నిర్వహించడంతో పాటు ఎస్ఐఆర్, ఓటర్ల నమోదుపై పలు కీలక నిర్ణయాలు కూడా ప్రకటించారు. అయినా ఆయన రాజీనామా డిమాండ్లు ఆగడం లేదు. అదే సమయంలో తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) కూడా సీఈసీ జ్ఞానేష్ కుమార్ తో పాటు సోషల్ మీడియాకు టార్గెట్ అవుతోంది. దీని వెనుక ఇద్దరు జడ్డీలు చేసిన వ్యాఖ్యలు కారణంగా కనిపిస్తున్నాయి.
ఇవాళ పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ (SIR)లో ఓట్లు కోల్పోయిన వారు చేసుకున్న 18 వేల అప్పీళ్లపై అక్టోబర్ 5న విచారణ జరపాలని నిర్ణయించిన సుప్రీంకోర్టు... అక్టోబర్ 6న రెండు అసెంబ్లీ సీట్లలో ఉప ఎన్నికల దృష్ట్యా.. దాన్ని ముందుకు జరపాలని పిటిషనర్లు కోరగా తిరస్కరించింది. అంతవరకూ బాగానే ఉన్నా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బెంగాల్లో జరిగేవి ఉప ఎన్నికలే కదా అంటూ ఆయన చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీతో పాటు విపక్షాలు, నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు.

అదే సమయంలో మరో న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ గతంలో ఇదే బెంగాల్ ఎస్ఐఆర్ వివాదంపై చేసిన వ్యాఖ్యలు కూడా తెరపైకి వచ్చేశాయి. గతంలో బెంగాల్ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ లో దాదాపు కోటి మంది వరకూ ఓట్లు కోల్పోయారు. దీనిపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా జస్టిస్ బాగ్చీ.. బెంగాల్ ఎన్నికల్లో ఈసారి ఓటు వేయకపోతే ఏమవుతుంది, వచ్చే ఎన్నికల్లో మీరు ఓటేసుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో పాటు ఇవాళ సీజేఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల్ని కలిపి ప్రస్తావిస్తూ.. సుప్రీంకోర్టు అండతోనే సీఈసీ జ్ఞానేష్ కుమార్ చెలరేగిపోతున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ పడుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి స్పందన లేదు.














Click it and Unblock the Notifications
