అందరూ జర్నలిస్టులు అయితే సమస్యలే? సుప్రీం సంచలన వ్యాఖ్యలు!
ప్రతి పౌరుడూ తానే ఒక జర్నలిస్టునని భావిస్తే సమాజంలో తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసన ప్రదర్శనలు జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే రిజిస్టర్డ్ మీడియా సంస్థలకు చెందిన గుర్తింపు పొందిన వందలాది మంది జర్నలిస్టులు రిపోర్టింగ్ చేస్తుంటారని, వారి మధ్యలోకి ఫ్రీలాన్సర్లు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు, సోషల్ మీడియా రీల్ మేకర్లు భారీ సంఖ్యలో వచ్చి చేరుతున్నారని కోర్టు పేర్కొంది. ఇలాంటి తరుణంలో అందరికీ జర్నలిస్టులుగా పనిచేసే హక్కును కల్పించడంపై లోతుగా పరిశీలించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.
ఢిల్లీలో జరిగే నిరసనలను కవర్ చేయడానికి వెళ్తున్న స్వతంత్ర, ఫ్రీలాన్స్ జర్నలిస్టులను ఢిల్లీ పోలీసులు గుర్తించడం లేదని, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అక్రెడిటేషన్ ఉండాలని పట్టుబడుతున్నారని సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రిజిస్టర్డ్ సంస్థలు జారీ చేసిన ఐడీ కార్డులు ఉన్న ఏ జర్నలిస్టునైనా పోలీసులు అడ్డుకోకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ఒక నిర్దిష్టమైన జాతీయ ప్రొటోకాల్ ఉండాలని ఆమె పిల్ రూపంలో కోరారు. ఫ్రీలాన్సర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ల భావప్రకటన స్వేచ్ఛను రక్షించాలని కోర్టును అభ్యర్థించారు.

ప్రతి ఒక్కరూ జర్నలిస్ట్ కాలేరన్న సీజేఐ ధర్మాసనం
ఈ వాదనలపై ప్రధాన జర్మన్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ స్పష్టమైన వివరణ ఇచ్చింది. ప్రతి ఒక్కరూ జర్నలిస్టులుగా మారిపోతే అది చివరికి అందరికీ ఇబ్బందికరంగా మారుతుందని సీజేఐ పేర్కొన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి బావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పి, ప్రతి ఒక్కరినీ జర్నలిస్టుగా పరిగణించలేమని జస్టిస్ బాగ్చీ స్పష్టం చేశారు. దీనిపై మరింత వివరమైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని కోర్టు తేల్చిచెప్పింది.
అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు మాత్రమే ప్రత్యేక రక్షణ వలయం
అధికారికంగా రిజిస్టర్డ్ అయిన మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులకు, అక్రిడిటేషన్ పొందిన వారికి కొన్ని ప్రత్యేకమైన రక్షణలు, నిబంధనలు ఉంటాయని ధర్మాసనం గుర్తుచేసింది. కానీ ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు లేదా రీల్స్ చేసేవారికి కూడా అదే స్థాయి రక్షణ వర్తింపజేయడం కష్టమని అభిప్రాయపడింది. ప్రతి పౌరుడికి ఉండే భావప్రకటన స్వేచ్ఛ వేరు, వృత్తి పరమైన జర్నలిజం చేసేవారికి ఉండే బాధ్యతలు వేరని తెలిపిన న్యాయస్థానం, ఈ అంశంపై సమగ్ర విచారణ చేపడతామని స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications
