దక్షిణ భారతదేశంలో తెలంగాణ అరుదైన రికార్డు!!
దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఏ రాష్ట్రంలోను లేనంత సినిమా థియేటర్ టికెట్ ధరలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. సింగిల్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్ లో రూ.150గా ఉండేవి. ఇవే చాలా ఎక్కువ అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్న తరుణంలో పెరిగిన టికెట్ ధరలతో ఎవరూ థియేటర్లకు వెళ్లడం మానేశారంటే అతిశయోక్తి కాదు. కథానాయకుడు, నిర్మాత, దర్శకుల అత్యాశే ఇప్పుడు థియేటర్ ఇండస్ట్రీ దెబ్బతినడాని కారణమవుతోంది. దీనికి తోడు పరిశ్రమ అడగకుండానే వారిని మంచి చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం వారిపై వరాల జల్లులు కురిపిస్తోంది. ఇది కూడా మరో కారణమవుతోంది.

రాజకీయ కారణాలవల్లే ధరల పెంపు
ఏపీలో రాజకీయ కారణాలవల్ల టికెట్ ధరలు తక్కువగా ఉంటే పరిశ్రమ పెద్దలు వెళ్లి పెద్ద బడ్జెట్ సినిమాలకు తమకు అనుకూలంగా ఉండే ధరలను సవరించుకునేలా అనుమతి తెచ్చుకున్నారు. తెలంగాణలో మాత్రం పరిశ్రమ అడగకుండానే ప్రభుత్వం ముందస్తుగానే ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తోంది. దీనివల్ల సింగిల్ స్క్రీన్‌లో ధర రూ.175, మల్టీప్లెక్స్ లో టికెట్ ధర రూ.295కు చేరింది.

సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దితేనే
కేజీఎఫ్, ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలను విజువల్ వండర్‌గా దర్శకులు తీర్చిదిద్దారు. వాటి కోసం ప్రత్యేకంగా థియేటర్లలోనే చూడాలనిపిస్తుంది కాబట్టి ప్రేక్షకులు వస్తున్నారు. కానీ ఎంత పెద్ద స్టార్ కథానాయకుడి సినిమా అయినా అది ఆర్ ఆర్ ఆర్ స్థాయి లేదంటే కేజీఎఫ్ స్థాయి విజువల్ వండర్స్ అయితేనే థియేటర్లకు వస్తున్నారు. లేదంటే సదరు కథానాయకుల సినిమాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. తొలి 10 రోజులు ధరలు పెంచుకోవడానికి అనుమతివ్వడంతో ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలతో కలిపి సింగిల్ థియేటర్లలో రూ.250, మల్టీప్లెక్స్ లో రూ.400 అవుతోంది. సినిమా ఎంత బాగా తీసినప్పటికీ ఈ ధరలతో థియేటర్లకు రావడానికి ప్రేక్షకుడు నిరాకరిస్తున్నాడు.

థియేటర్లు మూసేసుకోవాల్సిందే!!
సగటు ప్రేక్షకుడిని కుటుంబంతో సహా థియేటర్ కు తీసుకురావాలంటే సినిమా బాగా తీయడమొక్కటేకాదు.. టికెట్ ధరలు కూడా అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై ఉంది. అడిగారు కదా అని ధరలు పెంచుకోవడానికి అనుమతులు మంజూరు చేసుకుంటూ పోతుంటే ప్రేక్షకులు పూర్తిగాఓటీటీలమీదే ఆధారపడతారని, చివరకు ఉన్న థియేటర్లు కూడా మూసేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications