Sadak to Sansad: కాంగ్రెస్‌లో చేరిన వెంటనే.. వినేష్ ఫొగట్ సంచలనం
Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్.. సంచలనాలకు తెర తీశారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. రెజ్లింగ్ రింగ్ నుంచి ఎన్నికల బరిలో దిగబోతోన్నారు. సహచర రెజ్లర్ బజరంగ్ పునియాతో కలిసి రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకొన్నారు.
ఢిల్లీలో గల అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కేంద్ర కార్యాలయంలో.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, హర్యానా పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్, ఇన్‌ఛార్జ్ దీపక్ బబారియా సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. అనంతరం అక్కడే విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

దేశ ప్రజలకు ధన్యావాదాలు తెలియజేశారు. మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల విషయంలో ఢిల్లీలో తాము చేపట్టిన ఆందోళనలకు ప్రజలు అండగా నిలిచారని వ్యాఖ్యానించారు. పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైనప్పుడూ ఎంతగానో ఆదరించి, అక్కున చేర్చుకున్నారని పేర్కొన్నారు.
రోడ్ల మీద ఉంటూ రోజుల తరబడి తాము న్యాయంకోసం ఆందోళన చేసిన సమయంలో ఒక్క భారతీయ జనతా పార్టీ మినహా మిగిలిన అన్ని పక్షాలు కూడా తమకు మద్దతు ప్రకటించాయని వినేష్ ఫొగట్ గుర్తు చేశారు. దేశ నిర్మాణం కోసం ఎంతో త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరడం గర్వంగా ఉందని అన్నారు.
ఆందోళనలు చేస్తోన్న సమయంలో తమ పనైపోయిందంటూ కొంతమంది అసంబద్ధ వ్యాఖ్యానాలు చేశారని, వాటన్నింటికి తాము చేతలతో సమాధానం ఇచ్చామని అన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్ వరకు వెళ్లి.. సత్తా నిరూపించుకున్నామని చెప్పారు.ఇప్పుడు దేశ ప్రజలకు చేతనైనంత సహాయం చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడని, అంతకంటే పుణ్యకార్యం మరొకటి ఉండదని అన్నారు.
రెజ్లింగ్‌లో ప్రత్యర్థిపై విజయం సాధించడానికి ఎంత చిత్తశుద్ది, అంకిత భావంతో కష్టపడతామో రాజకీయాల్లో కూడా అంతే పట్టుదలతో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని రాజీలేని పోరాటం కొనసాగిస్తామని వినేష్ ఫొగట్ స్పష్టం చేశారు. సడక్ టు సంసద్ నినాదంతో ఎన్నికల్లో పోరాడుతామని అన్నారు.
త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా పోటీ చేయడం లాంఛనప్రాయమే. వారిద్దరి కోసం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు- చర్ఖీ దాద్రి, బద్లి, ఝులానా పేర్లను పరిశీలిస్తోన్నారు. సామాజిక వర్గాల వారీగా వినేష్ ఫొగట్, బజరంగ్ పునియాకు బలమైన ఓటుబ్యాంక్ ఉండటమే దీనికి కారణం.












Click it and Unblock the Notifications