ఆస్థాన జ్యోతిష్యుడిని అందలం ఎక్కించిన విజయ్- కీలక పదవి
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువుదీరిన తొలి రోజుల్లోనే అక్కడి నియామకాలు చర్చనీయాంశమౌతున్నాయి. పాలనపై పట్టు పెంచుకునే క్రమంలో విజయ్ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. తన అనుకున్న వాళ్లకు కీలక పదవుల్లో కూర్చోబెడుతున్నారు. ప్రభుత్వపరంగా కూడా వారి సేవలను వినియోగించుకోవడంలో వెనుకాడట్లేదు. మంత్రులకు శాఖలు కూడా కేటాయించిన నేపథ్యంలో ఇక అత్యున్నత స్థాయి అధికారుల నియామకాలపై దృష్టి పెట్టారు.
తాజాగా ముఖ్యమంత్రి రాజకీయ విభాగం ప్రత్యేక అధికారి (OSD) గా రిక్కీ రతన్ పండిట్ వెట్రివేల్ అపాయింట్ అయ్యారు. ఈ మేరకు పబ్లిక్ డిపార్ట్ మెంట్ ముఖ్య కార్యదర్శి రీటా హరీష్ ఠక్కర్.. కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేశారు. వెట్రివేల్ నటుడు కూడా. విజయ్‌కు ఆస్థాన జ్యోతిష్యుడిగా చాలాకాలంగా పని చేస్తోన్నారు. టీవీకే పార్టీ ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి రాజకీయ వ్యవహారాల ఓఎస్డీగా నియమితులయ్యారు.

ముఖ్యమంత్రి రాజకీయ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, సమాచార మార్పిడిని సమన్వయం చేస్తారు వెట్రివేల్. ప్రజా సంబంధాల కార్యకలాపాలను పర్యవేక్షించడం, ఎన్నికల వ్యూహాలలో పాల్గొనడం, ముఖ్యమంత్రి కార్యాలయం, పార్టీ మధ్య వారధిగా పనిచేయడం వంటి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఎలా చేరవేయాలి, జనంలోకి ఎలా చొచ్చుకెళ్లాలనే విషయాలపై వెట్రివేల్ ముఖ్యమంత్రికి సూచనలు చేస్తారు.
రిక్కీ రతన్ పండిట్ వెట్రివేల్ 40 సంవత్సరాలుగా జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ధ్యానం వంటి రంగాల్లో కొనసాగుతున్నారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తారు. జ్యోతిష్యంపై ఆయనకు గట్టి పట్టు ఉంది. తమిళనాడులో పండిట్ వెట్రివేల్‌గా ప్రసిద్ధి చెందారు. 2008లో ఢిల్లీకి షిఫ్ట్ అయిన తర్వాత తన పేరును రతన్ పండిట్‌గా మార్చుకున్నారు. ఇదివరకు ముఖ్యమంత్రి జయలలితకు ఆధ్యాత్మిక సలహాదారుగానూ వెట్రివేల్ పనిచేసినట్లు చెబుతున్నారు.
1991లో జయలలిత విజయాన్ని ఆయన అత్యంత కచ్చితంగా అంచనా వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. విజయ్ రాజకీయ భవిష్యత్తుపై చేసిన అంచనాలు కూడా నిజం అయ్యాయి. విజయ్ జాతకం చాలా బలంగా ఉందని, అది తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పు తీసుకువస్తుందని వెట్రివేల్ గతంలో పేర్కొన్నారు. టీవీకే 140 నుండి 170 స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, విజయ్ ముఖ్యమంత్రి అవుతారని, టీవీకే పేరుకు ఆయన పుట్టిన తేదీ, సంఖ్యాశాస్త్రానికి సరిపోతుందని కూడా అప్పట్లో జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications