Viral Video: నది వంతెనపై చిన్నారికి తప్పిన పెను ప్రమాదం..!!
Viral Video: జూన్ 1వ తేదీ ఆదివారం గోకర్ణలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, పోలీసుల అప్రమత్తత మధ్య జరిగిన ఈ ఘటన.. ఒక చిన్నారి ప్రాణాలను కాపాడిన వైనం అందరినీ నివ్వెరపరుస్తోంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, నిబద్ధతతో కూడిన పోలీసుల పనితీరుకు సలాం కొట్టాల్సిందే.
ఒక్క సెల్ఫీ... ప్రాణం మీదకు!
సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి అంకోలా నుంచి గోకర్ణకు వచ్చిన పర్యాటకులు... గంగావళి నదిపై ఉన్న వంతెన అందాలకు ముగ్ధులయ్యారు. ఇంకేముంది, కారు ఆపి మరీ సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, అక్కడే వాళ్లు చేసిన ఒక చిన్న పొరపాటు.. ఊహించని పరిణామాలకు దారితీసింది. ఆ అందమైన వంతెన అంచున, కింద నది ఉధృతంగా ప్రవహిస్తున్నా, ఒక చిన్నారిని ప్రమాదకరంగా నిలబెట్టి ఫోటోలు తీయడానికి సిద్ధమయ్యారు. ఆ దృశ్యం చూసిన ఏ ఒక్కరి గుండె అయినా గుభేల్ మంటుంది. చిన్న పట్టు తప్పినా, లేక మరీ చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియక వెనక్కి పడిపోయినా ఆ చిన్నారిని కాపాడటం దాదాపు అసాధ్యమే.

సీసీ కెమెరా వ్యవస్థ..ఆపద్బంధువుగా పోలీసులు!
అదే క్షణంలో, గోకర్ణ పోలీస్ స్టేషన్‌లో అమర్చిన అత్యాధునిక సీసీ కెమెరా వ్యవస్థ.. ఈ ప్రమాదకర దృశ్యాన్ని పసిగట్టింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా, కెమెరాతో అనుసంధానమైన స్పీకర్ల ద్వారా ఆ దంపతులకు నేరుగా హెచ్చరికలు జారీ చేశారు అక్కడి పోలీసులు. "మీ బిడ్డను వెంటనే కిందకు దించండి! అది చాలా ప్రమాదం!" అనే పోలీసుల హెచ్చరిక.. నిర్లక్ష్యంగా ఉన్న ఆ తల్లిదండ్రులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేయడేమే కాకుండా వారిని అలర్ట్ చేసింది. తమ చర్య ఎంత పెద్ద తప్పో అప్పుడే అర్థమైంది. వెంటనే బిడ్డను సురక్షితంగా కిందికి దింపి, అక్కడి నుంచి వెనుతిరిగారు.
ఎస్పీ ప్రశంసలు.. వైరల్ అవుతున్న వీడియో!
ఈ అద్భుతమైన సంఘటన వీడియోను ఉత్తర కన్నడ ఎస్పీ తమ 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకున్నారు. "జూన్ 1, 2025న మధ్యాహ్నం 1:20 గంటలకు గంగావళి నది వంతెనపై పర్యాటకులు తమ చిన్నారిని ప్రమాదకర స్థితిలో ఉంచడాన్ని సీసీ కెమెరాల ద్వారా గమనించాం. వెంటనే వారిని అప్రమత్తం చేసి, చిన్నారిని సురక్షితంగా పంపించాం. గోకర్ణ పోలీసుల పనితీరు అభినందనీయం!" అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ಇಂದು ದಿನಾಂಕ 01-06-2025 ರಂದು ಮಧ್ಯಾಹ್ನ 13:20 ಗಂಟೆಯ ಸುಮಾರಿಗೆ #ಗೋಕರ್ಣ ಪೊಲೀಸ್ ಠಾಣಾ ವ್ಯಾಪ್ತಿಯ #ಗಂಗಾವಳಿ ನದಿ ಸೇತುವೆ ಕಟ್ಟೆಯ ಮೇಲೆ ಪ್ರವಾಸಿ ದಂಪತಿಗಳಿಬ್ಬರು ತಮ್ಮ ಪುಟ್ಟ ಮಗುವನ್ನು ಅಪಾಯಕಾರಿ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿಕೊಂಡಿದ್ದನ್ನು ಗೋಕರ್ಣ ಠಾಣೆಯ ಪೊಲೀಸರು ಸಿಸಿ ಕ್ಯಾಮರಾಗಳಲ್ಲಿ ಗಮನಿಸಿ, ತಕ್ಷಣ ಪ್ರವಾಸಿ ದಂಪತಿಗಳಿಗೆ… pic.twitter.com/CKD2wW4azf
— SP Karwar (@spkarwar) June 1, 2025
పోలీసులు ఈ అసాధారణ అప్రమత్తత, నిబద్ధతకు సామాన్య ప్రజల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇలాంటి అత్యాధునిక నిఘా వ్యవస్థలు, వాటిని సమర్థవంతంగా వినియోగించుకునే పోలీసులు ఉన్నంత వరకు ప్రజల భద్రతకు ఢోకా లేదని ఈ ఘటన రుజువు చేసింది. ఒక చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టిన గోకర్ణ పోలీసులకు హ్యాట్సాఫ్ అని చెప్పాల్సిందే.












Click it and Unblock the Notifications