మీ అధికారులే మీ లోగుట్టు మాకు అందిస్తున్నారు: కేంద్రంపై బాంబు పేల్చిన రాహుల్ గాంధీ
కేంద్రం, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో కొద్దిసేపటి కిందటే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీనిదిగ్బంధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రజాస్వామ్యబద్ధమైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, సీఈసీని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోందని ఆరోపించారు.
రాజ్యాంగ వ్యవస్థల స్వతంత్రతను కాపాడటానికి ఇండియా కూటమి తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సుప్రీంకోర్ట్ మార్చ్ నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల నిరసనల ఉధృతి చూసి సీఈసీకి నిద్ర కరువైందని ఎద్దేవా చేశారు రాహుల్. సీఈసీ గతం, ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల వివరాలు తమ వద్ద ఉన్నాయనీ అన్నారు.

కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సుమారు 200 మందికి పైగా ఉన్నతాధికారులు ప్రస్తుతం తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, 50 శాతం మంది పోలీసులు తమవెంటే ఉన్నారని చెప్పారాయన. ప్రభుత్వానికి సంబంధించిన అంతర్గత సమాచారాన్ని సైతం ఎప్పటికప్పుడు తమకు అందిస్తున్నారని అన్నారు.
ఢిల్లీలో చేపట్టిన భారీ భద్రతా చర్యలు, ఆంక్షలపై రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు, నిరసనకారులు రాజధానికి రాకుండా నిరోధించడానికి రైళ్లు, బస్సుల రాకపోకలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని, నలువైపులా పోలీసు బలగాలను మోహరింపజేసి ఢిల్లీని ఒక బంధీఖానాలా మార్చేశారని ధ్వజమెత్తారు. జ్ఞానేష్ కుమార్‌ను రక్షించడానికి ప్రభుత్వం ఈ స్థాయి పోలీసు పహారా ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.
ఇదంతా ఎందుకు చేస్తోన్నదో, ఏం దాచాలని చూస్తోన్నదో దేశ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ పరిస్థితులన్నింటినీ చర్చించడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించామని, దానికి ఆయన అధికారిక పిటీషన్ దాఖలు చేయాలని సూచించినట్లు వివరించారు. సీజేఐ ఇచ్చిన సూచనల మేరకు ఈ మధ్యాహ్నం 3 గంటలకు సుప్రీంకోర్టుకు వెళ్లి పిటిషన్ సమర్పించనున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు.
అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడాన్ని ఓ సాధారణ చట్టపరమైన ప్రక్రియగా చూడలేమని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీన్ని.. దేశ భవిష్యత్తు, ప్రజాస్వామ్య మూలాలను కాపాడుకోవడానికి జరుగుతున్న నిర్ణయాత్మక పోరాటంగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతగా అణచివేత చర్యలకు పాల్పడినా తాము వెనకడుగు వేసేది లేదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు












Click it and Unblock the Notifications
