బీజేపీకి షాక్: శివసేనకే మద్దతు... రాజ్ థాకరే-ఉద్దవ్ కలుస్తున్నారా?
బృహన్ ముంబై కార్పోరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో పరిస్థితి అయోమయంగా ఉంది.
ముంబై: బృహన్ ముంబై కార్పోరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో పరిస్థితి అయోమయంగా ఉంది. 227 స్థానాలు కలిగిన బీఎంసీలో శివసేన 84, బీజేపీ 82, కాంగ్రెస్ 31, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన 7, ఎన్సీపీ 9, మజ్లిస్ 3, ఇతరులు 11 స్థానాలను గెలుచుకున్నాయి.
మేయర్ పీఠం కావాలంటే 114 సభ్యులు కావాలి. ఎక్కువ సీట్లు వచ్చిన బీజేపీ, శివసేనలు మేయర్ పీఠం దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.
ఇదే సమయంలో మేయర్ ఎన్నికల్లో శివసేనకు మద్దతు ఇచ్చేందుకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షులు రాజ్ థాకరే సుముఖంగా ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. రాజ్ స్వయంగా చెప్పకపోయినా.. తన ఆప్తుడు బాలానంద గౌంకర్ ద్వారా వెల్లడించిన మాటలను బట్టి అర్థమవుతోందని అంటున్నారు.

శివసేనకు చెందిన వ్యక్తినే మేయర్‌గా చూడాలనుకుంటున్నామని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. మరాఠీల సంక్షేమం కోసం రాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. శివసేన కూడా మద్దతు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
అయితే మద్దతు ఇచ్చినందుకు ప్రతిగా రాజ్ థాకరే మనుషులకు కీలకమైన కమిటీల్లో స్థానం ఇవ్వాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుందామన్న రాజ్ ప్రతిపాదనను ఉద్ధవ్ థాకరే తోసిపుచ్చినందున రాజ్ థాకరే కోపంగా ఉన్నారని, తన ప్రతిపాదనకు శివసేన అంగీకరించినట్లయితే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తేది కాదని, పూర్తి మెజారిటీ లభించేదని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.
ఒకవేళ శివసేన - ఎంఎన్ఎస్ కలిస్తే మహారాష్ట్రలో బీజేపీకి షాక్ ఖాయమని అంటున్నారు. శివసేన లేదా ఎంఎన్ఎస్ మద్దతు కోసం బీజేపీ ఎప్పటికి అప్పుడు ఎదురు చూస్తోంది. వారిద్దరి కలిస్తే బీజేపీ ఏకాకి కావడం ఖాయమంటున్నారు.












Click it and Unblock the Notifications