Womens Day: మహిళలకు ఉచితంగా రూ.2,500.. షరతులు ఇవే..
Womens Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఢిల్లీలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలను శక్తివంతం చేయడానికి ప్రభుత్వం మహిళలకు నెలవారీ రూ.2500 అందించబోతోంది. మహిళా సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం సంకల్పించింది. ఢిల్లీ సచివాలయంలో జరిగి కేబినెట్ సమావేశంలో మహిళా సమృద్ధి యోజనకు ఆమోదం లభించింది. మహిళా సమృద్ధి యోజన పథకం కింద ఢిల్లీలోని అర్హత కలిగిన మహిళలకు నెలకు రూ.2500 అందించనున్నారు.
ఈ పథకం కింద ఢిల్లీలోని 15 నుండి 20 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతారు. ఆ పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ పోర్టల్ ను అందుబాటులోకి తెస్తామని.. అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించడానికి ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందిస్తామని ఢిల్లీ సర్కారు ఇప్పటికే పేర్కొంది. రిజిస్ట్రేషన్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. ఆ తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

ప్రారంభంలో బీపీఎల్ కార్డుదారులు మాత్రమే మహిళా సమృద్ధి యోజన ప్రయోజనాన్ని పొందనున్నారు. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే బీపీఎల్ కార్డు కలిగిన మహిళలు మరే ఇతర ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం పొందకూడదు. ఢిల్లీలో గత నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ అధికారంలోకి రాగానే మహిళా సమృద్ధి యోజన కింద పేద కుటుంబాలకు చెందిన మహిళలకు నెలకు రూ.2500 అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ సర్కారు ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
అర్హతలు ఏమిటంటే?
*మహిళా సమృద్ధి యోజన ద్వారా ప్రయోజనం పొందే మహిళల వయస్సు 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
*దరఖాస్తు చేసుకునే ముందు దరఖాస్తుదారు కనీసం 5 సంవత్సరాలు ఢిల్లీలో నివసించి ఉండాలి.
*దరఖాస్తుదారులకు ఆధార్ నంబర్ ఉండాలి.
*దరఖాస్తుదారులు ఢిల్లీలో ఒకే ఒక ఆపరేటెడ్ బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి, అది వారి ఆధార్ నంబర్‌తో అనుసంధానించబడి ఉండాలి.
*కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించని మహిళలు ఈ పథకానికి అర్హులు. కానీ ఆ ప్రాంతంలోని ఎస్డీఎం లేదా రెవెన్యూ శాఖ అధికారి నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
ఈ పథకం కోసం ఏ పత్రాలు అవసరం?
ఈ పథకం కోసం నమోదు చేసుకునేందుకు ఏ పత్రాలు అవసరమో ఇంకా అధికారిక అప్ డేట్ లేదు. కానీ దరఖాస్తుదారులకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, మొబైల్ నంబర్ వంటివి అవసరం కావచ్చు. అలాగే దరఖాస్తును పోర్టల్‌లో ఆధార్‌కు లింక్ చేయవచ్చు.












Click it and Unblock the Notifications