Year Ender 2024: మోడీకి ఎక్స్ టెన్షన్-రాహుల్ కు ఎలివేషన్-ఇద్దరికీ మర్చిపోలేని ఏడాది..!
అతుకుల బొంత ప్రభుత్వాల కాలంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాల ఏర్పాటు గగనంగా మారిన వేళ కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుతో ఈ ఏడాది ఎన్డీయే చరిత్ర సృష్టించింది. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే అత్తెసరు గెలుపు సాధించినా చంద్రబాబు, నితీశ్ కుమార్ వంటి మిత్రుల సాయంతో హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ప్రధానిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తన యాత్రలతో జనంలోకి విస్తృతంగా వెళ్లి తెచ్చుకున్న ప్రజాదరణతో పార్టీకి జవసత్వాలు నింపడంతో పాటు లోక్ సభలో ప్రతిపక్ష నేత కూడా అయ్యారు.
ఈ ఏడాది లోక్ సభ ఎన్నికలకు ముందు ఎన్డీయే గెలుపు నల్లేరుపై నడకేనన్న ప్రచారం సాగింది. ఎందుకంటే అప్పటికే యూపీతో పాటు కీలకమైన హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కలిగి ఉన్న ఎన్డీయే .. జనవరిలో అయోధ్యలో హిందువుల కల అయిన రామమందిర నిర్మాణం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తోంది. దీంతో ఎన్డీయేకు హ్యాట్రిక్ ఖాయమనే అంచనాలు వచ్చేశాయి. అయితే అంచనాలను అందుకోవడంలో కొంతమేర విఫలమైనా మిత్రుల సాయంతో కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ప్రధాని మోడీ హ్యాట్రిక్ సాధించారు. అలాగే కేంద్రంలో మరింత బలపడ్డారు.

అటు లోక్ సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమిగా ఏర్పడి పొత్తుల విషయంలోనే నానా తంటాలు పడిన కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ ఎన్నికల్లో మాత్రం అనూహ్య ఫలితాలు అందుకున్నారు. ముఖ్యంగా బీజేపీ కంచుకోటగా భావిస్తున్న యూపీలో సగానికి పైగా సీట్లను కాంగ్రెస్, ఎస్పీతో కూడిన ఇండియా కూటమి సాధించడం, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో సాధించిన విజయాలు కాంగ్రెస్ కు ప్లస్ అయ్యాయి. అదే సమయంలో ఇండియా కూటమితో పాటు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారు. దీంతో సహజంగానే లోక్ సభలో తొలిసారి విపక్ష నేతగా మారారు.
కేంద్రంలో ప్రధాని మోడీ ప్రభావం గతంతో పోలిస్తే కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని నడుపుతుండటం ఆయనకు, ఆయన పార్టీ బీజేపీకి ప్లస్ గానే చెప్పుకోవచ్చు. అలాగే రాహుల్ గాంధీ గతంలో ఎన్నడూ లేనంత చురుగ్గా, ఉత్సాహంగా కనిపిస్తున్నారు. లోక్ సభలో పదేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ వందకు పైగా లోక్ సభ సీట్లు సాధించడం మారుతున్న రాజకీయాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. అలా ఒకే ఏడాదిలో ప్రధాని మోడీకి ఎక్స్ టెన్షన్, రాహుల్ కు ఎలివేషన్ వచ్చిపడ్డాయి.












Click it and Unblock the Notifications