
మొహంపై ఉమ్మి.. భౌతికదాడి చేసి, జొమాటో బాయ్‌పై దాడి.. ఎక్కడ, ఎందుకు అంటే..?
ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు అప్పుడప్పుడు నిరసనలు ఎదురవుతున్నాయి. వారిని కులం, మతం పేరుతో కొందరు అసహ్యించుకుంటున్నారు. ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా లక్నోలో కూడా ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఉత్తరప్రదేశ్ లక్నోలో జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ వివక్షను ఎదుర్కొన్నాడు. ఒకతనిపై దాడి జరిగింది.

ఎస్సీ తీసుకొచ్చాడని...
షెడ్యూల్డ్ క్యాస్ట్‌కు చెందిన ఒక వ్యక్తి ఫుడ్ డెలివరీ తెచ్చాడని, తిండి మైలపడిందని పడేశారు. డెలివరీ వ్యక్తిపై ఉమ్మి, కులం పేరుతో దూషిస్తూ కొట్టాడు. అతడి ద్విచక్ర వాహనాన్ని లాక్కున్నారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో బైక్ వెనక్కి ఇచ్చారు, అనంతరం వారిపై కేసు నమోదు చేశారు. నాలుగేళ్లుగా జొమాటో డెలివరీ మ్యాన్‌గా పని చేస్తున్న వినీత్ కుమార్ తనకు ఎదురైనా ఘటన గురించి స్పందించారు.

పిలిచి మరీ దాడి..
లక్నోలో ఓ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఫుడ్ డెలివరీ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లానని వివరించాడు. లొకేషన్‌కు చేరుకున్నాక.. ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తులు తన పేరు, కులం అడిగారని చెప్పారు. అవీ చెప్పగా అంటరాని వ్యక్తి తెచ్చిన తిండి తీసుకోమని పడేశారని వివరించారు. కులం పేరుతో తిట్టడం ప్రారంభించారని వాపోయారు. అవసరం లేకుంటే ఆర్టర్ క్యాన్సిల్ చేయమని వారిని కోరానరి.. వినకుండా తన ముఖంపై ఉమ్మారని.. మరికొంత మందిని పిలిచి భౌతిక దాడికి దిగారని వినీత్ తెలిపారు.

బండి లాక్కొని..
తన బండి లాక్కున్నారని.. పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేశానని వివరించారు. పోలీసులు ఘటనా ప్రదేశంలోకి వచ్చి బండి ఇప్పించారని వినీత్ తెలిపాడు. ఈస్ట్ జోన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అడిషనల్ కమిషనర్ ఆప్ పోలీస్ ఖాసీం అబిది తెలిపారు. సీసీటీవీ పుటేజీను పరిశీలిస్తున్నామని వివరించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇంకా వివక్షేనా..?
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం.. విభిన్న జాతులు, సంస్కృతులు ఇక్కడ కనిపిస్తాయి. అంటరాని తనం అనేది నేరం.. అంతా సమానమే.. కానీ ఇదీ చెప్పడానికే బాగుంది. చర్యలు మాత్రం అందుకు విరుద్దంగా జరుగుతుంది. లక్నో ఘటన ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. నిందితులపై అట్రాసిటీ కేసులు పెట్టినా.. ఫలితం లేకుండా పోతుంది.