Rasmussen survey: జో బైడెన్‌పై తీవ్ర వ్యతిరేకత: కమలా హ్యారిస్ వైపు అమెరికన్లు మొగ్గు
వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న తాజా పరిణామాలు రాజకీయంగా అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోన్నాయి. అధికార డెమొక్రటిక్ పార్టీ వైఖరిపై వ్యతిరేకతను పుట్టిస్తోన్నాయి. ఇదివరకు రిపబ్లికన్ పార్టీ మాజీ నాయకుడు జార్జ్ బుష్ ఆ దేశాధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా తాలిబన్లపై అనుసరించిన కఠిన వైఖరిని గుర్తుకు తీసుకొస్తోన్నాయి. న్యూయార్క్‌లోని ట్విన్ టవర్లపై విమానాలతో దాడులు చేసిన అల్-ఖైదా ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చందనే కారణంతో అప్పటి తాలిబన్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన ఉదంతాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటోన్నారు.

హీరోగా జార్జ్ బుష్
జార్జ్ బుష్ తీసుకున్న చర్యల వల్లే ఇప్పటిదాకా కూడా తాలిబన్ల పేరు కూడా వినిపించకుండా పోయింది. తాజాగా- ఆ దేశం నుంచి అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో వాళ్లు మళ్లీ పేట్రేగిపోయారు. జవసత్వాలను అందిపుచ్చుకున్నారు. ఏకంగా దేశాన్నే ఆక్రమించుకున్నారు. అమెరికా తన సైనిక బలగాలను ఉపసంహరించుకున్న అతి కొద్దిరోజుల్లోనే ఈ పరిణామాలు సంభవించాయి ఆప్ఘనిస్తాన్‌లో. న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై జరిపిన దాడికి ప్రతీకారంగా తాలిబన్లను అధికారంలోనే లేకుండా చేసి, అప్పట్లో ఆయన హీరోగా నిలిచారు.. అమెరికన్ల దృష్టిలో.

అలాంటి కఠిన వైఖరి ఏదీ?
అలాంటి కఠిన వైఖరిని అమెరికా మళ్లీ ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. అది ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వల్ల కాదని సగటు అమెరికన్ స్పష్టం చేస్తోన్నాడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేకపోవడం వల్ల కనీసం అధ్యక్షుడినైనా మార్చాలని కోరుకుంటోన్నారు. ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభాన్ని నివారించడంలో.. దాన్ని ఎదుర్కొనడంలో ఘోరంగా విఫలమయ్యారంటూ జో బైడెన్‌పై మండిపడుతున్నారు.

రాస్‌ముస్సేన్ సర్వే ఏం చెబుతోంది?
జో బైడెన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ఆయన స్థానాన్ని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో భర్తీ చేయాలని కోరుకుంటోన్నారు. తాజాగా రాస్‌ముస్సేన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అగ్రరాజ్యం అమెరికాకు సరైన దిశానిర్దేశం చేయగల సత్తా జో బైడెన్‌కు లేదని అమెరికన్లు కుండబద్దలు కొట్టారు. ఆయన స్థానంలో కమలా హ్యారిస్‌కు దేశ పగ్గాలను అప్పగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

కమలా హ్యారిస్‌కు 43 శాతం మద్దతు..
ఆప్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత రాస్‌ముస్సేన్ నిర్వహించిన సర్వే ఇది. అక్కడి పరిస్థితులను ఎవరు సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారనే విషయంపై 43 శాతం మంది అమెరికన్లు కమలా హ్యారిస్ వైపు మొగ్గు చూపారు. అదే సమయంలో- మరో 47 శాతం మంది కమలా హ్యారిస్ నాయకత్వాన్ని కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే- ఆమె కూడా డెమొక్రటిక్ పార్టీకి చెందిన నాయకురాలే కావడం. అంతర్జాతీయ స్థాయిలో ఆప్ఘన్ తరహా పరిస్థితులను రిపబ్లికన్లు మాత్రమే సమర్థవంతంగా ఎదుర్కొంటారని అభిప్రాయపడ్డారు.

55 శాతం మందికి
జో బైడెన్‌తో పోల్చుకుంటే కమలా హ్యారిస్ దేశాన్ని ముందుకు నడిపించగలరని 45 శాతం మంది విశ్వసించారు. మరో 55 శాతం మంది అమెరికన్లు దీనికి భిన్నంగా తమ అభిప్రాయాన్ని రాస్‌ముస్సేన్ సంస్థ సర్వేతో పంచుకున్నారు. కమలా హ్యారిస్ కూడా సమర్థవంతంగా అమెరికాను నడిపించగలరనే నమ్మకం తమలో లేదని స్పష్టం చేశారు. మెక్సికోతో సరిహద్దులను పంచుకునే విషయంలో కమలా హ్యారిస్ సక్సెస్ కాలేకపోయారనే అభిప్రాయం వారిలో నెలకొని ఉంది. అంతర్జాతీయ విషయాల్లో రిపబ్లికన్లే బెటర్ అనే అభిప్రాయాన్ని వారు వినిపించినట్లు రాస్‌ముస్సేన్ లేటెస్ట్ సర్వే పరోక్షంగా అంచనా వేసింది.

ఏడు శాతం మేర..
ఆప్ఘనిస్తాన్‌లో ఎప్పుడైతే కల్లోల పరిస్థితులు ఆరంభమయ్యాయో.. అప్పటి నుంచే జో బైడెన్ అప్రూవల్ రేటింగ్ క్షీణించడం మొదలైందని రాస్‌ముస్సేన్ సర్వే తెలిపింది. అంతకుముందు ఉన్న పాపులారిటీతో పోల్చుకుంటే- ఆఫ్గాన్ సంక్షోభం మొదలైన తరువాత ఆయన అప్రూవల్ రేటింగ్ ఏడు శాతం మేర తగ్గిందని స్పష్టం చేసింది. ఇదివరకు రాయటర్స్/ఐపీఎస్ఓఎస్ పోల్ సర్వేలో జో బైడెన్ అప్రూవల్ రేటింగ్ 53 శాతం వరకు ఉండగా.. క్రమంగా అది 46 శాతానికి తగ్గింది.

ఉపసంహరణను సమర్థించుకున్న బైడెన్
తమ దేశ సైనిక బలగాలను ఉపసంహరించుకోవడం వల్లే ఇస్లామిక్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు పేట్రేగిపోయారనే అపవాదును జో బైడెన్ మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. బలగాల ఉపసంహరణను మాత్రం ఆయన సమర్థించుకుంటోన్నారు. 20 సంవత్సరాలుగా అమెరికన్ సైన్యం ఆఫ్ఘన్‌లో పహారా కాస్తోందని, ఇంకా ఎన్నాళ్లు దీన్ని కొనసాగించాలని ఆయన ప్రశ్నిస్తోన్నారు. సైనికపరంగా ఆఫ్ఘన్ ప్రభుత్వం మెరుగుపడకపోవడమే తాలిబన్లు రెచ్చిపోవడానికి కారణమైందంటూ వ్యాఖ్యానించారు. దీనితో మరింత వ్యతిరేకత ఏర్పడిందని తెలుస్తోంది.

దిద్దుబాటు చర్యలకు..
ఆఫ్ఘన్‌లో నెలకొంటోన్న పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోన్న జో బైడెన్ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. తాలిబన్ల దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి మరోసారి మిత్ర దేశాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించే ప్రయత్నాల్లో పడింది. ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు తాము కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంపై కఠిన ఆంక్షలను విధించే అవకాశాలను అమెరికా పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది.

ఊపందుకున్న తరలింపు..
మరోవంక- ఆప్ఘనిస్తాన్‌లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను తరలించే ప్రక్రియను ముమ్మరం చేసింది అమెరికా. ఇప్పటిదాకా ఏడువేల మందిని తరలించినట్లు అమెరికా ఆర్మీ మేజర్ జనరల్ విలియమ్ హాంక్ టేలర్ తెలిపారు. ఈ విమానాశ్రయం తమ ఆధీనంలో ఉందని, 5,600 మంది సైనిక బలగాలను ఎయిర్‌పోర్ట్‌లో మోహరింపజేసినట్లు చెప్పారు. అలాగే- తాలిబన్లు అడ్డంకులను సృష్టిస్తోండటం వల్ల ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోలేకపోతోన్న తమదేశ పౌరులకు ఎస్కార్ట్ సౌకర్యాన్ని కల్పించనున్నామని అన్నారు. ఫ్లైట్ ఆపరేషన్స్, విమానాల రాకపోకలు సజావుగా సాగుతున్నాయని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications