పాకిస్థాన్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఫ్రాన్స్.. ఆ పైలట్లపై నిషేధం విధింపు
ఇటీవల జరిగిన ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ కు రాకపోకలు సాగించే విమానాల్లో పాకిస్థాన్ కు చెందిన పైలట్లు, క్యాబిన్ క్రూతో పాటు ఇతర సిబ్బంది విధులు నిర్వహించకుండా నిషేధం విధించింది. పాకిస్థాన్ తో పాటు 31 కు పైగా దేశాలపైనా నిషేధం విధించింది. పాకిస్థాన్, ఇరాన్, సౌదీ అరేబియా, తునియా కూడా ఇందులో ఉన్నాయి. ఇక ఇటీవల ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఇజ్రాయెల్ విధించిన కొత్త విమానయాన ఆంక్షలకు అనుగుణంగా చర్యలు తీసుకున్న తొలి విమానయాన సంస్థగా ఎయిర్ ఫ్రాన్స్ నిలిచినట్లు తెలుస్తోంది.
ఇక ఇదే విషయంపై స్పందించిన ఎయిర్ ఫ్రాన్స్ విమానయాన సంస్థ.. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏ దేశానికైనా విమానాలు నడిపేటప్పుడు ఆయా దేశాల చట్టాలను పాటించాల్సి ఉంటుందని.. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్ జారీ చేసిన నూతన భద్రతా ఆదేశాలకు కట్టుబడి పాకిస్థాన్ పైలట్లు, క్యాబిన్ సిబ్బందిని ఇజ్రాయెల్ రూట్లలో నడిచే విమానాల్లో నియమించడంపై నిషేధాన్ని విధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఎయిర్ ఫ్రాన్స్ స్పష్టం చేసింది. అయితే అంతర్జాతీయ విమానయాన రంగంలో ఇలాంటి ఆంక్షల ప్రభావం ఎంతవరకు ఉంటుందనే ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి.

మరోవైపు ఎయిర్ ఫ్రాన్స్ దారిలోనే ఇతర అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా ఇజ్రాయెల్ నిబంధనలకు అనుగుణంగా ఇలాంటి చర్యలు తీసుకుంటాయా అనే చర్చ మొదలైంది. ఇక ఇజ్రాయెల్ కొత్త రూల్స్ కారణంగా ఇథియోపియన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానాన్ని అక్కడి అధికారులు వెనక్కు మళ్లించినట్లు సమాచారం. ఈ విమానంలో ఇండోనేషియన్ పైలట్ ఉన్నట్లు గుర్తించిన ఇజ్రాయెల్ అధికారులు ఈ మేరకు విమానం వెనక్కు వెళ్లాలని ఆదేశించారు. దాంతో ఆ విమానం ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు తిరిగి వెళ్లింది. అక్కడ సదరు పైలట్ స్థానంలో మరో పైలట్ ను నియమించిన తర్వాత విమానం మళ్లీ బయలుదేరి టెల్ అవీవ్ లో ల్యాండ్ అయింది.












Click it and Unblock the Notifications
