మాటలు రాని చిన్నారిపై దాడి: చిట్టి తల్లి ఈ గాయాలను ఎలా తట్టుకున్నావ్..?
అమెరికాలోని విస్కాన్సిన్ నగరంలో హృదయం కదిలించే ఘటన ఒకటి చోటుచేసుకుంది. బధిరులకు విద్య బోధించే ఓ స్కూలుకు చెందిన 10 ఏళ్ల విద్యార్థిని ఏడ్చుకుంటూ ఇంటికి చేరుకుంది. ఎందుకు ఏడుస్తుందో ఆ చిన్నారి తల్లిదండ్రులకు ముందుగా బోధపడలేదు. చేతిమీద గాయాలు చూడటంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

శరీరంపై గాయాలు చూసి తల్లి షాక్
అమెరికాలోని విస్కాన్సిన్ నగరంలో లిల్లీ అనే విద్యార్థిని చదువుతోంది. పదేళ్ల లిల్లీకి మాటలు రావు. ఆమె చదివుతున్న స్కూలు కూడా బధిరులకు సంబంధించిన స్కూలే కావడం విశేషం. ఒక రోజు స్కూలు అయ్యాక స్కూలు బస్సులో ఇంటికి బయలుదేరింది. బస్సు దిగి ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్లింది లిల్లీ. లిల్లీని చూసిన తల్లి లిన్‌కి ముందుగా ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత స్నానం చేయిస్తే అంతా సర్దుకుంటుందని భావించి లిల్లీ టీషర్టును తొలగించింది. అంతే ఒక్కసారిగా ఆమె శరీరంపై ఎర్రగా ఉన్న గాయాలు చూసి షాక్‌కు గురైంది లిన్.

లిల్లీపై తోటి విద్యార్థులు దాడి చేస్తున్నా ఎవరికీ చెప్పలేని పరిస్థితి
లిల్లీ చేతిని ఎవరో బలంగా కొరికినట్లుగా గాయాలను చూస్తే అర్థమవుతోందని లిన్ ఫేస్‌బుక్‌లో రాసింది.అయితే బస్సులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాక కొందరు విద్యార్థులు లిల్లీపై దాడి చేసినట్లు వీడియోలో కనిపించాయి. చిన్నారి లిల్లీకి మాటలు రావు. బస్సులో అంత మంది విద్యార్థులు ఆమెపై దాడి చేస్తున్నప్పటికీ... అరిచేందుకు గొంతురాలేదు. విద్యార్థులు ఆ బంగారు తల్లి లేత శరీరంపై దాడిచేసి గట్టిగా కొరుకుతున్నా తనను కాపాడమని ఎవరినీ అడగలేకపోయింది. ఆ నొప్పిన భరించింది. లిల్లీ ఏడుపు తనకు తప్ప మరెవరికీ వినిపించని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే లిల్లీకి పదేళ్ల వయస్సు ఉన్నప్పటికీ మానసిక ఎదుగుదల మాత్రం రెండేళ్ల చిన్నారితో సమానంగా ఉంటుంది.

విచారణకు ఆదేశించిన స్కూలు యాజమాన్యం
లిల్లీ ఇంటికి చేరుకోగానే చేతిమీద ఒక గాయం చూసి తగ్గిపోతుందిలే అనుకున్నట్లు తల్లి లిన్ తెలిపింది. కానీ ఎప్పుడైతే టీషర్టు తొలగించిందో ఒళ్లంతా గాయాలు చూసి తన మనస్సు చలించిపోయినట్లు లిన్ తెలిపింది. అయితే డ్రైవర్‌కు కూడా చిన్నారి ఏడుపు వినిపించలేదని తెలిపారు. విషయం తెలుసుకున్న స్కూలు యాజమాన్యం విచారణకు ఆదేశించింది. వెంటనే లిల్లీ ఇంటికి వెళ్లి పరిస్థితి తెలుసుకున్నారు. బస్సులో ఎవరైనా పెద్దవాళ్లు ప్రయాణించి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని లిల్లీ తల్లిదండ్రులు అన్నారు. అయితే లిల్లీపై ఎవరైతే దాడి చేశారో వారు స్కూలుకు రావడం లేదని తెలుస్తోంది. మరోవైపు లిల్లీ వేరే వ్యాన్‌లో స్కూలుకు వెళుతోందని తల్లిదండ్రులు చెప్పారు.












Click it and Unblock the Notifications