S*x work: సెక్స్ వర్కర్లకు పెన్షన్లు, ఆరోగ్య బీమా..!!
అక్కడ సెక్స్ వర్క్‌ను అధికారికంగా గుర్తిస్తున్నారు.అంతేకాదు వారికి ఆయా రంగాల్లో ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తామంటోంది ఆ ప్రభుత్వం.ఇంతకీ ఏ ప్రభుత్వం సెక్స్ వర్కర్లను గుర్తిస్తోంది..? వారికి ఎలాంటి అవకాశాలు కల్పించనుంది..?
బెల్జియం దేశ ప్రభుత్వం ప్రపంచంలోనే ఏ దేశం తీసుకోలేనటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో సెక్స్ వర్క్‌ను చట్టబద్ధమైన వృత్తిగా గుర్తించాలని నిర్ణయించింది. అంతేకాదు సెక్స్ వర్కర్లకు ఆయా రంగాల్లో ఉద్యోగం పొందే హక్కును కల్పిస్తోంది. బెల్జియం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతోందని ఆ దేశ న్యాయవాదులు ప్రశంసిస్తున్నారు.ఇదొక సంచలనాత్మక చట్టంగా వారు పేర్కొన్నారు. సెక్స్ వర్కర్లను ఇక నుంచి ఇతర ఉద్యోగస్తుల్లానే పరిగణిస్తూ, కార్మిక చట్టాన్ని అనుసరించి వారు ఎలాంటి లబ్ధి అయితే పొందుతున్నారో సెక్స్ వర్కర్లకు కూడా ఆ ఫలాలను అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ఉద్యోగాలు, ఆరోగ్య బీమా, పెయిడ్ లీవ్స్, పెన్షన్‌లాంటివి అందజేస్తామని వెల్లడించింది.

చట్టంలో ఏముంది..?
సెక్స్ వర్క్ అనేది నేరం కాదని 2022లో బెల్జియం ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2024లో సెక్స్ వర్క్‌కు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.కొత్త చట్టం ప్రకారం తమ వద్దకు వచ్చే విటులకు నో చెప్పే అవకాశం ఉంది. బలవంతంగా శృంగారంలోకి లేదా లైంగిక కోరికలు తీర్చుకోవాలని చూస్తే వారిని నేరస్తులుగా పరిగణిస్తారు. అంటే లైంగిక చర్యకు ఇద్దరి సమ్మతం తప్పనిసరిగా ఉండాలి.అంతేకాదు సెక్స్ వర్కర్లు తమ సొంత సమయాన్ని కేటాయించుకునేలా చట్టంలో పొందుపర్చారు. అదే సమయంలో ఎప్పుడైనా విరమించుకునే అవకాశం కూడా ఉండేలా చట్టంలో పేర్కొన్నారు.
నిబంధనలు తూ.చా తప్పక పాటించాలి
ఇక సెక్స్ వర్కర్ల భద్రతపై కూడా చట్టంలో పొందుపర్చారు.ఇందుకోసం కొన్ని నిబంధనలను తెచ్చారు. పనివేళలు, డబ్బుల చెల్లింపులు,భద్రతా చర్యలు లాంటి అంశాలు సుదీర్ఘంగా పెండింగులో ఉండగా వాటన్నిటినీ క్లియర్ చేస్తూ చట్టంలో పొందుపర్చారు. సెక్స్ వర్కర్లను నియమించుకుంటున్న ఆయా సంస్థలు అధికారికంగా అనుమతి కలిగి ఉండాలి. చట్టంలో పొందుపర్చిన నిబంధనలు తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకు శుభ్రమైన పడకలు, కండోమ్‌లు, హైజీన్ ఉత్పత్తులతో పాటు వారి కార్యాలయాల్లో ఎమర్జెన్సీ బటన్స్ కూడా ఏర్పాటు చేసుకుని ఉంటేనే అనుమతి లభిస్తుంది. ఆ సంస్థపై ఎలాంటి లైంగిక వేధింపుల కేసులు నమోదై ఉండకూడదు.అక్రమ రవాణా చరిత్ర కలిగి ఉండకూడదు.
ఇక సెక్స్‌వర్కర్లు కూడా సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇస్తారు అయితే నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. నిబంధనలను అధిగమిస్తూ వారిపై కేసు నమోదు చేసి విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటారు. అయితే ఈ చట్టంపై కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. సెక్స్ వర్కర్లు అనుభవిస్తున్న వేదన బాధ గురించి ఇందులో పొందుపర్చలేదని, అధికారిక గుర్తింపు లేని సెక్స్ వర్కర్ల పరిస్థితి గురించి కూడా చట్టంలో వివరించలేదని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే జర్మనీ, నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో సెక్స్ వర్క్‌కు చట్టబద్ధత ఉన్నప్పటికీ బెల్జియంలా వారికి కార్మిక చట్టాలు వర్తించవు.












Click it and Unblock the Notifications