బిట్‌కాయిన్ దూకుడు ముందు బంగారం ధర బలాదూర్
బిట్‌కాయిన్ చరిత్ర సృష్టించింది. గరిష్టస్థాయిని అందుకుంది. సురక్షిత పెట్టుబడులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా దీని విలువ 1,25,000 డాలర్ల మార్క్ ను అధిగమించింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పేరుపొందిన బిట్‌కాయిన్ ఆసియా మార్కెట్ లో 1,25,689 డాలర్లకు చేరుకుంది. అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పెట్టుబడిదారులు ఎక్కువగా క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన బిట్ కాయిన్ దర 1,24,514 డాలర్లకు చేరిన విషయం తెలిసిందే. నిన్నటి వరకు కూడా అదే అత్యధికం. ఇప్పుడా రేటు దాటిపోయింది. 1,25,689 డాలర్లకు చేరింది. అమెరికన్ స్టాక్ మార్కెట్ ను బిట్‌కాయిన్‌తో అనుసంధానించిన ఎక్స్ఛేంజ్ అండ్ ట్రేడెడ్ ఫండ్స్ లోకి నిధులు భారీగా ప్రవాహించడం.. ఈ పెరుగుదలకు తోడ్పడినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో అమెరికా షట్‌డౌన్ కూడా దీనికి ఓ కారణంగా చెబుతున్నారు.

పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్ మెంట్లను క్రిప్టోకరెన్సీ వైపు మళ్లించడం, వాళ్లందరూ కూడా బిట్ కాయిన్ ను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దీని రేటు గరిష్టస్థాయికి పెరిగిందని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి. దీన్ని డెబాస్‌మెంట్ ట్రేడ్ అభివర్ణిస్తున్నాయి.
ఈక్విటీలు, బంగారం, పోకీమాన్ కార్డుల వంటి అనేక ట్రేడింగ్స్ కూడా ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయని క్రిప్టో ప్రైమ్ బ్రోకరేజ్ సంస్థ ఫాల్కన్ ఎక్స్ మార్కెటింగ్ కో-హెడ్ జోషువా లిమ్ వెల్లడించారు. బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. అమెరికాలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ లో చోటు చేసుకుంటోన్న హెచ్చుతగ్గుల వల్ల ఇన్వెస్టర్లు తమ నిధులను క్రిప్టో వైపు మళ్లిస్తోన్నారని, ఫలితంగా బిట్‌కాయిన్ లాభపడుతోందని అన్నారు.
క్రిప్టోకరెన్సీ రంగంలో అక్టోబర్ నెలను అప్- టోబర్ అని పిలుస్తారు. సాధారణంగా ఈ నెలలో క్రిప్టో రేట్లు భారీగా పెరుగుతుంటాయనేది మార్కెట్ వర్గాల అంచనా. గత పదేళ్లలో తొమ్మిదిసార్లు ఇదే నెలలో బిట్‌కాయిన్ లాభపడింది. ఇప్పుడు కూడా బిట్ కాయిన్ విలువ 30 శాతానికి పైగా పెరిగింది. కార్పొరేట్ సంస్థల ఆదరణ కూడా ఈ పెరుగుదలకు ఒక కారణం. గతంలో ఎప్పుడూ లేనంతా కార్పొరేట్ కంపెనీలు బల్క్ గా ఇందులో పెట్టుబడులు పెడుతున్నాయి.












Click it and Unblock the Notifications