ప్రధాని కుర్చీ కోసం రిషి సునక్ టీవీ డిబేట్: మూర్ఛపోయిన యాంకర్: ఆన్ స్క్రీన్ మీదే
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం కొనసాగుతోన్న ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఇప్పటివరకు అధికార కన్జర్వేటివ్ పార్టీలో అయిదు రౌండ్ల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. 11 మంది బ్రిటన్ ప్రధాని రేసులో నిల్చోగా.. ఇద్దరు మాత్రమే చివరి రౌండ్ వరకూ నిలిచారు. భారత సంతతికి చెందిన రిషి సునక్, లిజ్ ట్రస్.. ప్రధాని పోటీలో ఉన్నారు. వారిద్దరూ మంత్రివర్గ సహచరులే. రిషి సునక్.. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పని చేశారు. లిజ్ ట్రస్ విదేశాంగ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహించారు.
ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రధానమంత్రిగా నియమితులు కావడం ఖాయమైంది. బోరిస్ జాన్సన్ తరువాత బ్రిటన్ ప్రధానిగా ఎన్నిక అవుతారు. ఆ ఒకరు ఎవరనే విషయంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. వేవ్ చేతులు మారుతోంది. మొన్నటివరకు రిషి సునక్ వెనుకంజలో ఉన్నారు. తాజాగా కన్జర్వేటివ్ పార్టీ నిర్వహించిన సర్వేలో ఆయన మళ్లీ ఆధిక్యతలోకి వచ్చారు.

ప్రధాని ఎంపికలో భాగంగా కన్జర్వేటివ్ పార్టీ నిర్వహించిన టీవీ డిబేట్‌లో రసవత్తరంగా మారుతుందనే అంచనాలు వ్యక్తమైనప్పటికీ.. అదికాస్తా నిరుత్సాహ పరిచింది. అర్ధాంతరంగా ముగిసింది. రిషి సునక్-లిజ్ ట్రస్ మధ్య టీవీ డిబేట్ కొనసాగుతున్న సమయంలో యాంకర్ మూర్ఛపోయారు. ఇది ప్రత్యక్ష ప్రసారం కూడా అయింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో టీవీ డిబేట్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. మరోసారి దీన్ని నిర్వహిస్తామని కన్జర్వేటివ్ పార్టీ తెలిపింది.
టాక్ టీవీ ఈ డిబేట్‌ను నిర్వహించింది. లండన్ పశ్చిమ ప్రాంతంలోని ఈలింగ్ స్టూడియోస్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. డిబేట్ హాట్ హాట్‌గా కొనసాగుతున్న సమయంలో- ఈ కార్యక్రమానికి మోడరేటర్‌గా వ్యవహరించిన కేట్ మెక్‌కాన్ మూర్ఛపోయారు. టీవీ డిబేట్ సందర్భంగా ప్రధాని అభ్యర్థులిద్దరూ తమ తమ ప్రాధాన్యతలను వివరించే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అభ్యర్థులిద్దరికీ ప్రశ్నలను సంధిస్తుండగానే కేట్ మెక్‌కాన్ సొమ్మసిల్లారు. డయాస్‌పై పడిపోయారు. ఇది లైవ్ టెలికాస్ట్ అయింది కూడా. ఈ దృశ్యాన్నిచూసిన లిజ్ ట్రస్.. ఓ మై గాడ్ అంటూ వ్యాఖ్యానించడం రికార్డయింది. ఈ ఘటనతో రిషి సునక్-లిజ్ ట్రస్ మధ్య టీవీ డిబేట్ రద్దయినట్లు కన్జర్వేటివ్ పార్టీ తెలిపింది. మరోసారి నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటామని వివరించింది. ప్రస్తుతానికి ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉందని పేర్కొంది.












Click it and Unblock the Notifications