ఉక్రెయిన్ పౌరుల హత్యపై విచారణ చేపట్టాలి - తక్షణమే ముగింపు పలకాలి : భారత్ డిమాండ్..!!
ఉక్రెయిన్ లో సాధారణ పౌరుల హత్యలను భారత్ ఖండించింది. ఈ హత్యల పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం పైన స్వతంత్ర విచారణ అవసరమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా భారత్ డిమాండ్ చేసింది. బూచా హత్యలపైన భారత శాశ్వత రాయబారి టి ఎస్ తిరుమూర్తి మాట్లాడారు.హత్యలకు సంబంధించి వచ్చిన వార్తలు చాలా ఆవేదన కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతుంటే దౌత్యమే అత్యుత్తమ మార్గం అని స్పష్టం చేసారు. ఈ వ్యవహారం పైన స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసారు.

పరిస్థితులు క్షీణించాయి
ఉక్రెయిన్ వ్యవహారంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చివరి సారిగా చర్చించినా..అక్కడ పరిస్థితి ఆశించిన విధంగా మెరుగుపడలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఉక్రేయిన్ లో భద్రతతో పాటుగా మానవీయ పరిస్థితులు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేసారు. బూచాలో హత్యలను ప్రతీ ఒక్కరూ ఎటువంటి సంకోచం లేకుండా ఖండించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ లో మానవీయ సాయం పైన అంతర్జాతీయ సమాజం సానుకూలంగా స్పందించాలని.. ఆ విధంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లో తిరుమూర్తి అభిప్రాయపడ్డారు.

భారత్ ఆందోళనగా ఉందంటూ
దీనికి కొనసాగింపుగా..ఉక్రెయిన్‌లో దిగజారుతున్న పరిస్ధితుల పైన భారత్ ఆందోళనగా ఉందని వెల్లడించారు. వెంటనే అక్కడ హింసకు ముగింపు పలికి.. దౌత్యమార్గాల్లో ముందుకు వెళ్లాలని సూచించారు. అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ఐక్యరాజ్యసమితి లోపలా..బయటా దేశాలన్నీ ప్రణాళికా బద్దంగా .. ఐక్యంగా పని చేయాల్సిన అవసరం ఉందని తిరుమూర్తి సూచించారు. ఉక్రెయిన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో మందులతో పాటుగా ఇతరత్రా మానవీయ సాయం అందించేందుకు అన్ని దేశాలు సానుకూలంగా స్పందిస్తామని ఆశిస్తున్నట్లు తిరుమూర్తి పేర్కొన్నారు.

రష్యా పై జెలెన్ స్కీ ఫైర్
ఇక, ఇప్పటికే రష్యా చేస్తున్న దురాగతాలపై స్పందించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యా ఆక్రమణ తర్వాత తొలిసారి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రసంగించిన ఆయన..రష్యా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య తేడా లేదన్నారు. తాను బూచా నగరంలో పర్యటించిన విషయాన్ని వెల్లడించారు. తమ దేశానికి సేవలందిస్తున్న అనేక మందిని రష్యా సైన్యం చంపేసిందని పేర్కొన్నారు. తాము వీటోను మరణించే హక్కుగా మార్చే దేశంతో యుద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇది ప్రపంచ భద్రతకు భంగం కలిగిస్తుందని జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications