Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంక్షోభం మీద సంక్షోభం: సిరియాకు భూకంప సహాయం అందించడం ఎందుకు కష్టమవుతోంది?

సిరియా
Click here to see the BBC interactive

ఒక సంక్షోభంలో మరో సంక్షోభం, ఇంకో సంక్షోభం.. ఇదీ సిరియా పరిస్థితి. దశాబ్దకాలంగా అంతర్యుద్ధంతో అల్లాడిపోతున్న దేశాన్ని గతవారం భూకంపం అతలాకుతలం చేసింది. మానవతా సహాయానికి అంతర్గత ఘర్షణలు అడ్డంకిగా మారాయి.

అయితే, భూకంపం వచ్చిన నాలుగు రోజుల తరువాత సిరియా వైఖరిలో కొంత మార్పు కనిపిస్తోంది. మానవతా సహాయనికి ఇది అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు.

దేశంలోని అన్ని ప్రాంతాలకు మానవతా సహాయాన్ని అందించేందుకు సిరియా క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది.

దీని తరువాత, ఐరాస హ్యుమానిటేరియన్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్ మాట్లాడుతూ, "ఇది మంచి పరిణామం. కానీ, మరిన్ని మార్పులు రావాలి" అన్నారు.

ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాలే కాక, ఇతర గ్రూపుల నియంత్రణలో ఉన్న ప్రాంతాలలోనూ సహాయక చర్యలకు సిరియా ప్రభుత్వం అంగీకరించిందని సనా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఐక్యరాజ్య సమితి, సిరియన్ అరబ్ రెడ్ క్రెసెంట్, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్‌క్రాస్‌ సంయుక్తంగా సహాయక చర్యలు చేపడతాయని పేర్కొంది.

అయితే, ఈ వార్తలను మరింత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు.

"సిరియా ప్రభుత్వ ప్రకటనకు అర్థం.. సిరియాలో ప్రధాన నగరాలకు సహాయక చర్యలు పంపించాలని. అంతే తప్ప, పక్క దేశాల నుంచి సరిహద్దుల మీదుగా సహాయక చర్యలు అందించవచ్చని కాదు. అయితే, ప్రజల ప్రాణాలను రక్షించే అత్యవసర సహాయాన్ని అందించడానికి అదనపు క్రాసింగ్ పాయింట్స్‌కు అత్యవసరంగా అనుమతించాలని కోరుతున్నాం" అని గ్రిఫిత్ అన్నారు.

ప్రస్తుతం, వాయువ్య సిరియాలో ఉన్న ఇడ్లిబ్‌లోకి ప్రవేశించడానికి మాత్రమే అనుమతి ఉంది. ఇది తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతం. బాబ్ అల్-హవా ద్వారా టర్కీ సరిహద్దు మీదుగా ఈ ప్రాంతంలోకి ప్రవేశించవచ్చు.

ఉత్తర సిరియా ప్రాంతాలలోకి మానవతా సహాయాన్ని పంపించడానికి టర్కీ సరిహద్దులోని బాబ్ అల్-సలామెహ్ నుంచి మరొక మార్గానికి అనుమతి ఇవ్వమని సిరియా, దాని మిత్రదేశాలను ఐరాసా కోరింది. అలాగే, ఈశాన్యం వైపు కుర్దిష్ జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలను చేరడానికి ఇరాక్ వైపు నుంచి రావడానికి అనుమతి ఇవ్వాలని కూడా కోరింది.

బాబ్ అల్-సలామెహ్ వద్ద, అల్-రాయ్ వద్ద మానవతా సహాయ కేంద్రాలు నిర్వహించడానికి అంకారా (టర్కీ) అనుమతి పొందామని ఈ వారం సిరియా ప్రత్యర్థి సమూహాలు ప్రకటించాయి.

సిరియాలో ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య సామాన్యులు నలిగిపోతున్నారు.

గురువారం, ఐరాసా నుంచి మొదటి సహాయక కాన్వాయ్ దుప్పట్లు, ఇతర సామాగ్రి బాబ్ అల్-హవా గుండా సిరియాలో ప్రవేశించినప్పుడు, అంత మంచి స్పందన రాలేదు.

భూకంపం రాక ముందు ఈ సహాయం సిరియాకు అందవలసి ఉందని సిరియన్ జర్నలిస్ట్ ఇబ్రహీం జైడాన్ అన్నారు.

సోమవారం వచ్చిన ప్రకంపనలకు ఈ మార్గం బాగా దెబ్బతింది. ఈ మార్గం 40 లక్షల కంటే ఎక్కువ మంది సిరియన్లకు జీవనాధారంగా ఉంది.

సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభంలో చాలామంది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసలు వెళుతూ ఉండేవారు. చేతిలో ఏమి మిగలని జనానికి ఇప్పుడు ఆ అవకాశం కూడా పోయింది.

"సిరియాలో వాయువ్య ప్రాంతం భూకంపానికి అత్యధికంగా ప్రభావితం అయింది. అక్కడ సహాయక చర్యలు అందించేందుకు మాకు పూర్తి అనుమతి కావాలి" అని నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ జాన్ ఈజెలాండ్ అన్నారు.

గతంలో, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాల ద్వారా ప్రత్యర్థి సమూహాలు ఉన్న ప్రాంతాలకు మానవతా సహాయన్ని చేరవేయడానికి అనుమతించలేదని కొన్ని సంస్థలు తెలిపాయి.

మార్గమధ్యలో మానవతా సహాయ వనరులను దారి మళ్లిస్తారనే ఆందోళన కూడా ఉంది.

"సిరియా ప్రభుత్వం, సాయుధ తిరుగుబాటు సమూహాలు రాజకీయాలను పక్కనపెట్టి సహాయానికి అనుమతిస్తాయని ఆశిస్తున్నాం. ఇది చాలా అవసరం" అని జాన్ ఈజెలాండ్ అన్నారు.

సిరియా గతంలో కూడా సహాయక చర్యలకు అనుమతిస్తున్నట్టు ప్రకటించినా, ఆచరణలో చూపలేదని కూడా జాన్ ఈజెలాండ్ గుర్తుచేశారు. మళ్లీ అలా చేస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు.

సిరియాలో గడ్డకట్టుకుపోయే చలిలో లక్షలాది బాధితులు రోడ్లపై ఉన్నారు. వారికి ఎలాగైనా సహాయాన్ని అందించేందుకు ఐరాసా మార్గాలను అన్వేషిస్తోంది.

ఈ వారం గ్రిఫిత్ తుర్కియే, సిరియాలలో పర్యటించనున్నాను. రెండు దేశాల ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు ఆయన వెళుతున్నారు.

సిరియన్లు సంవత్సరాల తరబడి పేదరికంలో, వివిధ సంక్షోభాల్లో మగ్గిపోతున్నారు.

"పశ్చిమ దేశాలు అన్ని దేశాలనూ ఒకేలా ఎందుకు చూడవు? ఇది మానవత్వం కాదు. రాజకీయం" అని సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రత్యేక సలహాదారు డాక్టర్ బౌతైనా షాబాన్ ఈ వారం బీబీసీ న్యూస్‌షోర్ కార్యక్రమంలో అన్నారు.

సిరియాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని, ఈ ఆంక్షల వల్ల విదేశాల్లో ఉన్న సిరియన్లు సహాయం అందించలేకపోతున్నారని ఆమె అన్నారు.

కాగా, సిరియాలో భూకంప బాధిత ప్రాంతాల్లో ఆక్షలకు ఉపశమనం ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది.

సిరియాకు పంపే సహాయం ఎప్పుడూ ఆయుధంగా మారుతుంది. సిరియాలో అతర్యుద్ధం భీకరంగా ఉన్న రోజుల్లో మేం అక్కడి నుంచి రిపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా చూశాం.. "లొంగిపోవాలి లేదా ఆకలితో అలమటించాలి" అన్న వ్యూహాన్ని కనికరం లేకుండా పాటించేవారు. ముఖ్యంగా ప్రభుత్వ దళాలు, ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చే వారిని ఇలాగే శిక్షించేవి.

రాజకీయంగా సిరియా మ్యాప్ సహాయక చర్యలకు ఒక మందుపాతర. వాయువ్య సిరియాలో కుర్దిష్ దళాలు ఎక్కువ భాగన్ని నియంత్రిస్తాయి.

ఒకవైపు, సహాయం తమ ద్వారానే వెళ్లాలని సిరియా అధికారులు నొక్కి చెబుతున్నారు.

ఉత్తర-పశ్చిమ సిరియాలో ఎక్కువ భాగం హయత్ తహ్రీర్ అల్-షామ్ ఆధీనంలో ఉంది. తుర్కియే, అమెరికాలు దీన్ని తీవ్రవాద ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తాయి.

ఇస్లామిక్ స్టేట్ బలగాల నియంత్రంలో ఉన్న ప్రాంతాలు సహాయక చర్యలకు అడ్దంకిని పెంచుతాయి.

సిరియా అంతర్యుద్ధంలో 27వేలమంది చిన్నారులు కూడా మరణించినట్లు అంచనా

అయితే, ఈ భూకంపం అరబ్ దేశాల వైఖరిలో కూడా కొంత మార్పు తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది.

మొదట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సిరియా, తుర్కియే దేశాలకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. సౌదీ అరేబియా కూడా ఇదే చేసింది.

ఇటీవల కాలంలో, సిరియా, తుర్కియే వైఖరుల్లో కాస్త మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. రష్యా మద్దతు ఉన్న తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్ కూడా ఘర్షణలు తగ్గించాలన్నట్టు మాట్లాడారు.

కానీ, ఉత్తర సిరియాలో తుర్కియే ట్రూపులు ఉండడం పెద్ద అడ్డంకి. కానీ, ఈశాన్య ప్రాంతంలో సిరియన్ సైన్యం, వాయువ్యంలో సిరియన్ కుర్దిష్ సేనలు ముందుకు రాకుండా ఉండేందుకు తుర్కియే ట్రూపులను అక్కడ ఉండడం ఎర్దోవాన్‌కు అవసరం.

సిరియాలో ఒక్క యుద్ధం కాదు, తుర్కియే, అమెరికా, రష్యా, ఇరాన్ దేశాల సేనలు అక్కడ ఏదో ఒక ప్రాంతంలో ఉన్నాయి. ఆకాశంలో ఇజ్రాయెల్ వైమానిక దళాలు అనుమానిత ఇరానియన్ల కోసం, లేదా లెబనీసె హిజ్బుల్లా లక్ష్యాల కోసం తిరుగుతూనే ఉంటాయి.

"సిరియాలో సహాయక చర్యల్లో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం ఉండకూడదు. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రాతాలకు అయినా సరే, ప్రత్యర్థి సమూహాల ఆధీనంలో ఉన్న ప్రాంతాలకయినా సరే" అన్నారు ఈజెలాండ్.

"ముందు ప్రజలు" తరువాతే రాజకీయలు అన్నారాయన. సిరియాలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+