ఉక్రెయిన్‌లోని 11 ఎయిర్‌ఫీల్డ్‌లు, 70కి పైగా సైనిక స్థావరాలు ధ్వంసం చేశాం: రష్యా
కైవ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలతో ఆ దేశ వైమానిక దళాలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. ఆ దేశంలోని 11 ఎయిర్‌ఫీల్డ్‌లతో సహా 70కిపైగా సైనిక స్థావరాలను తమ సైన్యం ధ్వంసం చేసినట్లు రష్యా గురువారం రాత్రి వెల్లడించింది. రష్యన్ బలగాలు జరిపిన దాడుల్లో 74 ఉక్రెనియన్ సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. వీటిలో 11 ఎయిర్‌ఫీల్డ్‌లు ఉన్నాయని రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకొవ్ తెలిపారు.
Recommended Video
అంతేగాక, ఓ ఉక్రెయిన్ సైనిక హెలికాప్టర్ తోపాటు నాలుగు డ్రోన్లను కూడా కూల్చివేసినట్లు ఇగోర్ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నప్పటికీ.. ఉక్రెయిన్ తన శక్తికి మించి రష్యా బలగాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. గురువారం తెల్లవారుజాము నుంచి రష్యా జరిపిన దాడుల్లో 68 మంది సైనికులు, పౌరులు మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

అంతకుముందు మిలిటరీ విమానాన్ని కూల్చడంతో 14 మంది మృతి
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ రాజధానిపై బాంబు దాడులతో రష్యా విరుచుకుపడుతోంది. రష్యా దాడుల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో సైనికులు, సామాన్య ప్రజలు మరణించారు. తాజాగా, ఉక్రెయిన్ మిలిటరీకి చెందిన ఓ విమానాన్ని నేల కూలింది.
దాదాపు 14 మందితో ప్రయాణిస్తున్న ఉక్రెయిన్ సైనిక విమానం రష్యా సైనికుల దాడిలో కుప్పకూలింది. దీంతో విమానంలోని 14 మంది సైనికులు మరణించారు. రాజధాని కైవ్ సమీపంలో విమానం కూలిపోయిందని ఉక్రెయిన్ అత్యవసర సేవలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎప్పీ తెలిపింది.
ఉక్రెయిన్‌లో రష్యా సైనికులు జరిపిన దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 40 మంది చనిపోయారు. లుహాన్స్క్ ప్రాంతంపై రష్యా విమానాన్ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ గతంలో పేర్కొంది.
వైమానిక రక్షణను 'అణచివేస్తూ' ఉక్రెయిన్ వైమానిక స్థావరాలలో సైనిక మౌలిక సదుపాయాలను చేపట్టడాన్ని కూడా రష్యా ధృవీకరించింది.
ఇదిలా ఉండగా, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్‌కు తూర్పున ఉన్న రెండు ప్రాంతాలను రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకుంది.
యుద్ధానికి ముందు, వ్లాదిమిర్ పుతిన్ తన టెలివిజన్ ప్రసంగంలో ఉక్రేనియన్ సైనికులు తమ ఆయుధాలు విడిచిపెట్టి ఇంటికి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య ఘర్షణలు 'అనివార్యమైనవి', ప్రత్యేక సైనిక చర్య 'ఉక్రెయిన్‌లో సైనికీకరణ, నిర్వీర్యీకరణ లక్ష్యం' అని స్పష్టం చేశారు.
దేశం కోసం ఆయుధాలు పట్టాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడి పిలుపు
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమర్ జెలెన్క్సీ ఈ సందర్భంగా తమ దేశ ప్రజలనుద్దేశించి కీలక పిలుపునిచ్చారు. దేశంలో కోసం పోరాడేందుకు సిద్ధంగా ఎవరున్నా.. వారికి ఆయుధాలను ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. దేశం కోసం పోరాడేవారందరికీ అవసరమైన ఆయుధాలను ఇస్తామన్నారు.
రష్యాతో ఉద్రిక్తతలు పెరగడంతో ఇటీవలి వారాల్లో ప్రాథమిక సైనిక శిక్షణ పొందుతున్న ఉక్రేనియన్ పౌరుల చిత్రాలను మీరు చాలాసార్లు చూసినట్లు మీకు గుర్తుండే ఉండవచ్చు.
రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకున్న ఉక్రెయిన్
ఉక్రెయిన్ భూభాగంపై దాడి చేసిన తరువాత ఉక్రెయిన్ అధికారికంగా రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకున్నట్లు అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మీడియా సమావేశంలో తెలిపారు.
ఉక్రేనియన్లు తమ దేశంపై రష్యా యుద్ధం ప్రకటించడంతో అప్రమత్తమయ్యారు. రష్యా దాడులు చేస్తుండటంతో నిన్న రాత్రి నుంచే ప్రజలు ఏటీఎంలు, పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ఇక్కడ తూర్పు ఉక్రెయిన్‌లో ఉద్రిక్తత, అనిశ్చితి, భయానక వాతావరణం ఉంది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారు.
బుధవారం రాత్రి నుంచే పేలుళ్ల శబ్ధాలతో ఇక్కడి ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారు. పెద్దలు, పిల్లలు ఎంతో ఆందోళనకు గురవుతున్నారు. పేలుళ్ల శబ్ధాలకు పిల్లలు భయంతో విలపిస్తున్నారు. దాడుల భయంతో తాము తమ పిల్లలతో ఇంట్లోనే ఉంటున్నామని ఉక్రెయిన్ ప్రజలు చెబుతున్నారు. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని అధికారులు ఇప్పటికే చెప్పారని తెలిపారు.












Click it and Unblock the Notifications