Donald Trump or Kamala Harris?: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మొదలు..!
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగున్నర గంటలకు అమెరికా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పయనమవుతున్నారు. రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ తో డెమోక్రాట్ అభ్యర్ధి కమలా హ్యారిస్ ముఖాముఖీ పోరు హోరాహోరీగా సాగుతుందన్న అంచనాల నేపథ్యంలో ఎన్నికలపై అంతర్జాతీయంగా కూడా ఆసక్తి నెలకొంది.
అమెరికా తూర్పు తీరంలో ముందుగా పోలింగ్ కేంద్రాలు ఓటర్ల కోసం తెరుచుకున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 80 మిలియన్ల మంది ముందస్తు ఓటింగ్ లో పాల్గొన్నారు. మిగిలిన వారు ఇవాళ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే దేశవ్యాప్తంగా వివిధ కాలమానాలు ఉండటంతో అక్కడ సమయం ఆధారంగా పోలింగ్ కేంద్రాలు తెరుచుకోనున్నాయి. ప్రస్తుతం న్యూ హాంప్‌షైర్-కెనడా సరిహద్దులోని చిన్న టౌన్‌షిప్‌లో తెల్లవారు జామున మొదటి ఓట్లు పడినట్లు నివేదికలు వస్తున్నాయి.

ఈసారి ఎన్నికల్లో ట్రంప్, హ్యారిస్ కూ మధ్య నెలకొన్న హోరాహోరీ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక అధికారులు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో బందోబస్తు కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కీలకమైన ఓట్ల లెక్కింపు ప్రధాన కార్యాలయాన్ని రక్షించడానికి పైకప్పుపై స్నిపర్‌ల ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల కార్యకర్తల కోసం పానిక్ బటన్‌లు, ఓవర్ హెడ్‌పై నిఘా డ్రోన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయానికి పోలింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత క్రమంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.













Click it and Unblock the Notifications