Donald Trump: అవినీతి నిరోధక చట్టాన్ని సస్పెండ్ చేసిన ట్రంప్.. గౌతమ్ అదానీకి ఉపశమనం!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలో వచ్చిన అనంతరం పాట చట్టాల్లో మార్పులు చేయడం మొదలుపెట్టారు. తాజాగా అమెరికన్ బిజినెస్ సామ్రాజ్యాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఓ కీలక చట్టాన్ని తాత్కాలికంగా ట్రంప్ నిలిపివేశారు. విదేశీ అవినీతి పద్ధతుల (Foreign Corrupt Practices Act-FCPA) చట్టాన్ని సస్పెండ్ చేసి వ్యాపార విభాగాలకు ఉపశమనం కల్పించాలని నూతన అటార్నీ జనరల్ పామ్ బోండీకి డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఎఫ్సీపీఏ చట్టం అమెరికా విదేశాంగ విధాన లక్ష్యాలకు ఆటంకం కలిగిస్తోందని.. అందువల్ల విదేశాంగ వ్యవహారాలపై అధ్యక్షుడి అధికారాన్ని దెబ్బతీస్తోందని వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
ఎఫ్సీపీఏ చట్టం ఏంటి?
అమెరికాతో సంబంధాలున్న ఏ కంపెనీ లేదా వ్యక్తి అయినా విదేశాల్లో వ్యాపారాన్ని భద్రపరచకువడానికి విదేశీ అధికారులకు డబ్బు లేదా బహుమతులు ఇవ్వకుండా ఎఫ్సీపీఏ యాక్ట్ నిషేధిస్తుంది. అలా లంచం లేదా బహుమతులు ఇవ్వడం 1977లో ప్రవేశపెట్టిన ఎఫ్సీపీఏ(FCPA) చట్టం ప్రకారం నేరం. అయితే అమెరికా కంపెనీల పోటీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని, వ్యాపారాలకు విఘాతం కలిగిస్తోందని ట్రంప్ వాదిస్తున్నారు. ట్రంప్ తన మొదటి పదవి కాలంలోనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని భావించారు.

అదానీకి ప్రయోజనం ఏంటి?
భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై కూడా ఎఫ్సీపీఏ(FCPA) చట్టం ప్రకారం విచారణ జరుగుతోంది. అమెరికా న్యూయార్క్ లోని ఫెడరల్ కోర్టులో అదానీతో సహా 7 మందిపై మోసం, లంచం ఆరోపణలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇండియాలో సౌరశక్తి ప్రాజెక్టును పొందేందుకు భారతీయ అధికారులకు 250 మిలియన్ డాలర్లు లంచం ఇస్తానని వాగ్దానం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ డబ్బును సేకరించేందుకు అమెరికా ఇతర దేశాల ఇన్వెస్టర్లు, బ్యాంకులకు మాయమాటలు చెప్పారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇదే చట్టం ప్రస్తావనకు వచ్చింది. అయితే ట్రంప్ ఆ చట్టాన్ని నిలిపివేయడం వల్ల.. ఇలాంటి కేసులపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది అదానీ గ్రూప్ కు పెద్ద ఉపశమనం కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష డెమోక్రాట్లు విమర్శిస్తున్నారు. ఇది అవినీతికి తలుపులు తెరిచే ప్రమాదం ఉందని అంటున్నారు. ఎఫ్సీపీఏ(FCPA) కింద కొనసాగుతున్న అన్ని దర్యాప్తులు, కేసులను నిలిపివేయాలని డొనాల్డ్ ట్రంప్ న్యాయ శాఖను ఆదేశించారు. ట్రంప్ నిర్దేశించిన విధంగా అమెరికా అటార్నీ జనరల్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసే వరకు ఈ నిషేధం కొనసాగుతుంది.
ఎఫ్సీపీఏను ట్రంప్ ఎందుకు నిలిపివేశారు?
ఈ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయని.. ఇది అమెరికన్ కంపెనీల పోటీ సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని ట్రంప్ సర్కారు చెబుతోంది. ఈ చట్టం అమెరికన్ కంపెనీలు వాణిజ్య అవకాశాలను, ముఖ్యంగా ఖనిజాలు, ఓడరేవులు, మౌలిక సదుపాయాల వంటి కీలక రంగాలను అనుసరించడాన్ని కష్టతరం చేస్తోంది. మరోవైపు ట్రంప్ పరిపాలనలో ఎఫ్సీపీఏ(FCPA) నిబంధనలను సడలించడం ద్వారా అమెరికన్ కంపెనీలకు రాయితీలు ఇస్తే.. వారు ప్రపంచ స్థాయిలో వేగంగా విస్తరించగలుగుతారు.
ఈ పరిణామం తర్వాత అదానీ గ్రూప్ షేర్లు మంచి పెరుగుదలను చూస్తున్నాయి. గౌతమ్ అదానీకి చెందిన ఫ్లాగ్ షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ అత్యధికంగా లాభపడింది. దాని స్టాక్ 4.28 శాతం పెరిగింది. అదానీ పవర్ షేర్లు 4.17 వరకు, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్స్ 3.34 శాతం వరకు పెరిగాయి. న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ షేర్లు 3 శాతం పెరిగాయి. ఇది కాకుండా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ షేర్లు గ్రీన్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి.












Click it and Unblock the Notifications