ట్రంప్ కు ఎంతో ఇష్టమైన బిగ్, బ్యూటిఫుల్ బిల్- ఒక్క ఓటు తేడాతో
Donald Trump Big, Beautiful bill: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెయిన్ ఛైల్డ్ గా చెప్పుకొనే బిగ్, బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందింది. హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ దీన్ని ఆమోదించింది. ఒకే ఒక్క ఓటు తేడాతో ఈ బిల్లును పాస్ చేసింది యూఎస్ హౌస్. ఈ బిల్లు ఆమోదం పొందడం పట్ల డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.
అమెరికన్లు చెల్లించే పన్నులను భారీగా తగ్గించడానికి ఉద్దేశించిన బిల్లు ఇది. హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ ఆమోదం కోసం ఇటీవలే సభ ముందుకు వచ్చిందీ బిల్లు. దీనిపై విస్తృతంగా చర్చ సాగింది. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి గల కారణాలు, దాని ఉద్దేశాలు, అమెరికన్లకు ఎంత వరకు లబ్ది కలిగిస్తుంది.. అనే విషయాలపై రెప్రజెంటేటివ్స్ చర్చించారు.

అనంతరం స్పీకర్ మైక్ జాన్సన్ ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ లో ఈ బిల్లుకు అనుకూలంగా 215 మంది సభ్యులు ఓటు వేశారు. దీనికి వ్యతిరేకంగా 214 ఓట్లు పోల్ అయ్యాయి. ఒక్క ఓటు తేడాతో బిల్లు సభ ఆమోదం పొందినట్లు మైక్ జాన్సన్ ప్రకటించారు. దీన్ని అడాప్ట్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ బిల్లు ఇప్పుడు సెనేట్‌కు వెళ్తుంది.
తాను అధికారంలోకి వస్తే ఇలాంటి బిల్లును ప్రవేశపెడతానంటూ ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. దీనికి అనుగుణంగా బిగ్, బ్యూటిఫుల్ ట్యాక్స్ బిల్లుకు రూపకల్పన చేశారు. తాజాగా యూఎస్ హౌస్ ఆమోదం కూడా పొందడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ట్రంప్ తన తొలి హయాంలోనే ఇలాంటి బిల్లును అమలు చేశారు. 2017లో ఆమోదం పొందిన అప్పటి బిల్లు గడువు త్వరలో ముగియబోతోంది. అమెరికన్ల పన్నును తగ్గిస్తూ అప్పట్లో దీన్ని అమలు చేసింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. దీని గడువు ముగియబోతోన్న నేపథ్యంలో ఈ బిల్లు ఆమోదం పొందడం వల్ల పన్ను కోతలను మరి కొంత కాలం పొడిగించడానికి అవకాశం లభించినట్టయింది.
ఓవర్ టైం పని, టిప్స్ పై పన్నులను తాత్కాలికంగా తొలగిస్తుందీ బిల్లు. తక్కువ ఆదాయం ఉన్న అమెరికన్లకు మెడికైడ్ హెల్త్‌కేర్ ప్రోగ్రామ్ కింద వైద్య సహాయం పొందవచ్చు. పన్నుల్లో కోతలను పొడిగించడం వల్ల ఇది కార్పొరేషన్లు, సంపన్నులకు లబ్ధి చేకూరుస్తుందనే విమర్శలు ఉన్నాయి.
రక్షణ రంగానికి భారీగా నిధులు సమకూర్చడం, డిపొర్టేషన్ వంటి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం ఈ బిల్లులో ముఖ్యమైన అంశాలు. ఓవర్‌టైమ్, టిప్స్ పై పన్నుల రద్దు.. శ్రామిక వర్గాలకు ఉపశమనం కలిగిస్తుందని డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చెబుతున్నారు.
ఈ బిల్లులో మెడిక్ ఎయిడ్.. అంటే తక్కువ ఆదాయం ఉన్న అమెరికన్లకు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం, 4.2 కోట్ల మందికి పైగా అమెరికన్లు ఉపయోగించే స్నాప్ ఆహార సహాయ కార్యక్రమం వంటి సంక్షేమ పథకాలకు గణనీయంగా నిధుల కోతలను ప్రతిపాదించిందీ బిల్లు.
ఇప్పటికే అమెరికా చేసిన అప్పులు 5.2 ట్రిలియన్ల డాలర్ల భారాన్ని మరింత పెంచుతుందనే ఆందోళనలు ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లోటును సుమారు 600 బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. రుణాలపై వడ్డీ చెల్లింపులు పెరిగే అవకాశం ఉంది.
డెమొక్రాట్లు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. తక్కువ ఆదాయం ఉన్న అమెరికన్ల ప్రయోజనాలను ఈ బిల్లు దెబ్బతీస్తుందని హెచ్చరించారు. యువత, మహిళలు ఈ బిల్లు వల్ల భారీగా నష్టపోతారని అంటున్నారు. మెడిక్ ఎయిడ్ పై ఆధారపడిన వయోధిక వృద్ధులు, దివ్యాంగులు నష్టపోతారని చెబుతున్నారు.
పలు జిల్లాల్లో ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు మూత పడే ప్రమాదం ఉందని డెమొక్రటిక్ సభ్యులు ఆరోపిస్తోన్నారు. కాగా ఈ బిల్లు తదుపరి ఆమోదం కోసం సెనెట్ కు వెళ్లనుంది. ఫలితంగా- అక్కడ కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకోవడానికి అవకాశం ఉందని ది న్యూయార్క్ పోస్ట్ అభిప్రాయపడింది.
ఈ బిల్లు ఆమోదం పొందడం పట్ల డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. బిల్లులో భారీ పన్ను కోతలు ఉన్నాయని, టిప్స్ పై పన్ను ఉండదని అన్నారు. ఓవర్‌టైమ్‌పై పని చేసే వాళ్ల ఆదాయం పైనా పన్ను ఉండదని చెప్పారు. అమెరికాలో తయారైన వాహనాలను కొనుగోలు చేసినప్పుడు పన్ను తగ్గుతుందని వివరించారు.
ఐసీఈ, బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లకు వేతనాలు భారీగా పెరుగుతాయని, గోల్డెన్ డోమ్ కోసం నిధులు, నవజాత శిశువులకు ట్రంప్ సేవింగ్స్ ఖాతాల వంటి వెసలుబాటు కల్పిస్తుందని ట్రంప్ చెప్పారు. సెనేట్ ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదించాలని, తన కార్యాలయానికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
ఈ బిల్లును వ్యతిరేకించిన డెమొక్రాట్లపై డొనాల్డ్ ట్రంప్ సెటైర్లు సంధించారు. ఓ లక్ష్యం అంటూ ఉండట్లేదని ఎద్దేవా చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తరువాత విశ్వాసం, ధైర్యం, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించట్లేదని చురకలు అంటించారు. నేరస్థులు అమెరికాలో ప్రవేశించడానికి, ప్రతి ఒక్కరికీ లింగమార్పిడి చేయడానికి డెమొక్రాట్లు బాటలు వేశారని, ఇలాంటివి ఇక ఉండబోవని అన్నారు.












Click it and Unblock the Notifications