న్యూయార్క్‌కు చేరుకున్న డొనాల్డ్ ట్రంప్: కోర్టులో సరెండర్
వాషింగ్టన్: అమెరికన్ టాప్ పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపుల వ్యవహారంలో అరెస్ట్‌ను ఎదుర్కొంటోన్న వేళ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కోర్టులో లొంగిపోనున్నారు. తన అరెస్ట్ తప్పదంటూ ఆయన ఇదివరకే స్పష్టం చేశారు. తనకు అండగా నిలవాలంటూ మద్దతుదారులకు పిలుపునిచ్చారు. నిరసన ప్రదర్శనలను చేయాలని సూచించారు. అక్రమ చెల్లింపుల కేసులో మన్‌హట్టన్ న్యాయస్థానం తీర్పు వెలువడించే అవకాశం ఉన్న నేపథ్యంలో- ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆయనపై ఉన్న ఆరోపణలు రుజువైతే అమెరికాలో ఒక మాజీ అధ్యక్షుడికి ప్రత్యక్ష ప్రమేయం ఉన్న తొలి క్రిమినల్ కేసు ఇదే అవుతుంది. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఎన్నికల కంటే ముందే టాప్ అమెరికన్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ (Porn Star Stormy Danials)తో తనకు ఉన్న సంబంధాలు బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారు.

దీనికోసం తన తరఫు అడ్వొకేట్‌ను మధ్యవర్తిగా పెట్టి- ఆమెకు పెద్ద మొత్తం డబ్బులను చెల్లించారనేది ట్రంప్ ఉన్న ఆరోపణలు. 2006లో ట్రంప్ తనతో సెక్స్ చేశారని స్టార్మీ డేనియల్స్ ఇటీవలే బయటపెట్టారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయాన్ని బయటపెట్టకుండా ఉండటానికి బెదిరించారని, తాను నోరెత్తకుండా ఉండటానికి 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని స్పష్టం చేశారు. ఈ కేసును మన్‌హట్టన్ క్రిమినల్ కోర్టు విచారణ కొనసాగిస్తోంది.
ఈ కేసులో కోర్టు తనను దోషిగా తేల్చిన వెంటనే లొంగిపోవాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. దీనికోసం కొద్దిసేపటి కిందటే ఆయన న్యూయార్క్‌కు చేరుకున్నారు. తాను నివసిస్తోన్న వెస్ట్‌పామ్ బీచ్ నుంచి ప్రైవేట్ ఫ్లైట్‌లో ట్రంప్ న్యూయార్క్‌లోని లాగ్వార్డియా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ట్రంప్ తరఫున వైట్ కాలర్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్ టాడ్ బ్లాంచె.. మన్‌హట్టన్ కోర్టులో వాదించనున్నారు.
విచారణ కొనసాగే సమయంలో కోర్టు రూమ్‌కు మీడియా ప్రవేశాన్ని నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. వీడియో, ఫొటో, రేడియో కవరేజీని అనుమతించవద్దని కోరారు. లొంగిపోయిన తరువాత కూడా ట్రంప్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటపెట్టొద్దని అభ్యర్థించారు. ఇంకాస్సేపట్లో విచారణ ఆరంభమౌతుంది. ట్రంప్ అరెస్ట్ తప్పదంటూ అమెరికన్ మీడియా అభిప్రాయపడుతోంది. అందుకే న్యాయస్థానం తనను దోషిగా తేల్చిన వెంటనే లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.
ఆయన కోర్టుకు హాజరు కానున్నందున న్యూయార్క్ పోలీసులు ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు. మన్‌హట్టన్ న్యాయస్థానం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లను అమర్చారు. న్యాయస్థానానికి దారి తీసే మార్గాలన్నింటినీ మూసివేశారు. వీఐపీలు రాకపోకలు సాగించడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. కోర్టుకు దారి తీసే మార్గాల్లో పెద్ద ఎత్తున సాయుధ పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి తలెత్తినా తక్షణమే స్పందించేలా చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications