భవిష్యత్ లో వైట్‌హౌస్ లో అడుగు పెట్టే ఏ అధ్యక్షుడైనా సరే..: ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో పరాజయాన్ని చవి చూసింది.. అధికార రిపబ్లికన్ పార్టీ. యూఎస్ కాంగ్రెస్ లో సెనెట్, హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ పై పట్టు కోల్పోయింది. ఈ ఎన్నికల అనంతరం దాదాపుగా మూడింతల మెజారిటీని సాధించింది ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ. డెమోక్రాట్ల ప్రభంజనం ముందు.. రిపబ్లికన్ల కంచుకోటలు సైతం తుడిచిపెట్టుకుపోయాయి. దశాబ్దాలుగా విజయానికి నోచుకోని చోట డెమోక్రాటిక్ జెండా ఎగిరింది.
ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడో రోజే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్ తో పాటు క్యాబినెట్ రూమ్ ను జాతీయ స్మారక చిహ్నాలుగా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైనా సంతకం చేశారు. భవిష్యత్ లో వైట్ హౌస్‌లోకి వచ్చే ఏ అధ్యక్షుడైనా సరే.. ఈ రెండింటి కార్యాలయాల మూల నిర్మాణాన్ని ఏ మాత్రం కూడా మార్చకుండా, వాటి స్వరూపాన్ని దెబ్బతీయకుండా అడ్డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం.

జాతీయ స్మారక చిహ్నాలుగా మార్చడం వల్ల అందులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి వీలు ఉండదు. ఈ ప్రాంగణాల్లో ఎలాంటి భారీ నిర్మాణాలు చేపట్టాలన్నా, వాటిని పునర్నిర్మించాలన్నా కఠిన నిబంధనలు వర్తిస్తాయి. భవిష్యత్ లో వైట్ హౌస్ లోకి వచ్చే అధ్యక్షులు తమ అభిరుచికి అనుగుణంగా ఓవల్ ఆఫీస్, క్యాబినెట్ రూమ్ కార్యాలయాల ఇంటీరియర్ డెకరేషన్, ఫర్నిచర్ ఎంపిక, రంగులు మార్చుకోవడం, భద్రతా పరమైన చిన్నచిన్న మార్పులకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.
అంతే తప్ప వాటి స్వరూపాన్ని మార్చేలా ఎలాంటి అదనపు నిర్మాణ పనులకు కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనుమతించదు. ఈ ఉత్తర్వులను సమర్థవంతంగా అమలు చేసే బాధ్యతను డొనాల్డ్ ట్రంప్ అంతర్గత వ్యవహారాల కార్యదర్శి డగ్ బర్గమ్‌కు అప్పగించారు. ఓవల్ ఆఫీస్, క్యాబినెట్ రూమ్‌ల చారిత్రక శైలి, నిర్మాణ విశిష్టతను కాపాడటానికి ఓ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయనను ఆదేశించారు.
ఇకపై ఈ నిర్మాణాలలో ఏవైనా భారీ మార్పులు చేయాల్సి వస్తే.. అధికారిక ఆమోదం తప్పనిసరి అవుతుందని, చారిత్రక చిహ్నాలను ఎవరు పడితే వారు నాశనం చేయకుండా ఉండటానికే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ట్రంప్ స్పష్టం చేశారు. ఓవల్ ఆఫీస్ అంటే తనకెంతో ఇష్టమని, వైట్ హౌస్ లాగే ఇది కూడా చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటోన్నట్లు వ్యాఖ్యానించారు. ట్రంప్ రెండో విడత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైట్ హౌస్ సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ధ వహించారాయన.
ఓవల్ ఆఫీస్‌లో బంగారు రంగులో మెరిసిపోయే ఫ్రేమ్‌లు, నూతన జామర్లు, ప్రత్యేక ఎంబ్రాయిడరీ వస్త్రాలు, ఖరీదైన ఫర్నిచర్‌ను అమర్చారు. క్యాబినెట్ రూమ్‌ను కూడా ఆధునీకరించారు. వైట్ హౌస్ ఈస్ట్ వింగ్‌లో నిర్మిస్తున్న నూతన బాల్‌రూమ్ నిర్మాణం, లింకన్ మెమోరియల్ పూల్ సుందరీకరణను కూడా ఆయన ప్రాధాన్యతాంశంగా తీసుకున్నారు. మధ్యంతర ఎన్నికల పరాజయం అనంతరం ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications
