Illegal Immigrants: ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం- దడదడ
Trump Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెర తీశారు. అక్రమ వలసలను ఉక్కుపాదంతో అణచివేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో మూడు దేశాలపై కొరడా ఝుళిపించారు. భారీగా టారిఫ్ విధించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు ట్రంప్. ఇది- ట్రేడ్ వార్‌కు దారి తీసింది.
ట్రంప్ టారిఫ్‌ను ఎదుర్కొంటోన్న దేశాల్లో కెనడా, మెక్సికో, చైనా ఉన్నాయి. ఈ మూడు దేశాలపైనా విధించిన సరికొత్త టారిఫ్ తక్షణమే అమలులోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మూడు దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని రకాల వాహనాలు, వస్తువులు, సరుకులు, ఆహార పదార్థాలపై కొత్త టారిఫ్‌కు అనుగుణంగా డ్యూటీని వసూలు చేస్తారు.

ఈ మూడింట్లో మెక్సికోపై అత్యధికంగా టారిఫ్ భారం పడింది. 25 శాతం టారిఫ్‌ను అదనంగా చెల్లించాల్సి ఉంటుందా దేశానికి. కెనడా, చైనాలపై 10 శాతం మేర టారిఫ్‌ను విధించింది అమెరికా. ఇందులో కెనడాకు కాస్త ఊరట కల్పించారు ట్రంప్. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే ఇంధన సంబంధిత ఉత్పత్తులను ఈ కొత్త టారిఫ్ నుంచి మినహాయింపునిచ్చారు.
గ్యాసొలైన్, హోమ్ హీటింగ్ ఆయిల్ ధరల భారం అధికంగా పడకూడదనే ఉద్దశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సీనియర్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ ఆఫీసర్ తెలిపారు. కెనడాకు సంబంధించినంత వరకు కొత్త టారిఫ్ ఛార్జీలు, ఇతర డ్యూటీలు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయి. మెక్సికో, చైనాకు సంబంధించిన టారిఫ్ ఎప్పటినుంచి వసూలు చేస్తారనే విషయంపై స్పష్టత రాలేదు.
అక్రమ వలసదారులను అడ్డుకోవడం, ఎలాంటి అధికారిక డాక్యుమెంట్లు లేకుండా ఇప్పటికే తమ దేశంలో నివసిస్తోన్న వాళ్లను వెనక్కి పిలిపించుకునేలా కెనడా, మెక్సికో, చైనాపై ఒత్తిడిని తీసుకుని రావడంలో భాగంగా ఈ టారిఫ్‌ను విధించారు డొనాల్డ్ ట్రంప్.
అక్రమ వలసదారుల నుంచి అమెరికన్లను రక్షించాల్సిన బాధ్యత ఓ అధ్యక్షుడిగా తనపై ఉందని ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రంప్ ట్రూత్‌పై ఓ ప్రకటన పోస్ట్ చేశారు. అమెరికాలో అక్రమంగా నివసించే వివిధ దేశాల పౌరుల వల్ల భద్రత కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వారి వల్ల అమెరికనలు మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని వ్యాఖ్యానించారు.
2023లో 1,07,000 మందికి పైగా అమెరికన్లు డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల మరణించారు. ఇందులో దాదాపు 70 శాతం మంది ఫెంటానిల్ సహా ఇతర డ్రగ్స్ వినియోగం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నట్టు తేలింది. 2024లో అమెరికా దక్షిణ ప్రాంతం సరిహద్దుల్లో దాదాపు 21,900 పౌండ్ల ఫెంటానిల్‌ను కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ స్వాధీనం చేసుకుంది.












Click it and Unblock the Notifications