మళ్లీ గేమ్ స్టార్ట్ చేసిన ట్రంప్..!!
Donald Trump: రష్యా-ఉక్రెయిన్ మధ్య సంవత్సరాల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధానికి అంతం అనేది ఉండట్లేదు. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి.
ఈ యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిళ్లు, ఆంక్షలు, పలు రకాల నిషేధాలను కూడా రష్యా ధీటుగా ఎదుర్కొంటోంది.
రష్యా సైన్యానికి అంత తేలిగ్గా తలవంచట్లేదు ఉక్రెయిన్. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను సైతం విడిపించుకోగలిగింది.
అదే సమయంలో ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగడం రష్యాను ఆందోళనకు గురి చేసింది. రెండు రోజుల కిందటే లాంగ్ రేంజ్ మిస్సైల్‌తో రష్యాపై దాడి చేసింది ఉక్రెయిన్. అమెరికా అభివృద్ధి శక్తిమంతమైన క్షిపణి ఇది. ఈ మిస్సైల్‌ను సంధించడంతో తొలిసారిగా ఆత్మరక్షణలో పడినట్టయింది రష్యాకు.
దీనితో రష్యా అనూహ్య దాడికి దిగింది. కొద్దిరోజుల కిందట ఏకంగా ఉక్రెయిన్‌పై హైపర్‌సొనిక్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను సంధించింది. దిన్‌ప్రో సిటీలో విధ్వంసాన్ని సృష్టించిందీ మిస్సైల్. భారీగా ఆస్తినష్టం సంభవించింది. అలాంటి మిస్సైళ్లను ఈ రెండు దేశాలు ఎన్నింటినో సంధించుకున్నాయి.
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించడంపై సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడతానని ప్రకటించారు. వారానికి సగటున 5,000 కంటే ఎక్కువ మంది రష్యన్, ఉక్రేనియన్ సైనికులను చంపుతున్న ఈ బ్లడ్ బాత్ ను ఆపడం తన ఫోన్ కాల్ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.
వారితో వాణిజ్య సంబంధాలను కొనసాగించేలా తన తదుపరి చర్యలు ఉండొచ్చని వెల్లడించారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి కిందటే తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ లో ఓ పోస్ట్ పెట్టారు. పుతిన్ తో నేరుగా మాట్లాడుకునే వరకు శాంతి చర్చల్లో పెద్దగా పురోగతి ఉంటుందని తాను భావించట్లేదని వ్యాఖ్యానించారు ట్రంప్. అందుకే పుతిన్ తో మాట్లాడతానని వెల్లడించారు.












Click it and Unblock the Notifications