పాకిస్తాన్‌లో భారీ భూకంపం
Pakistan earthquake 2025: ఇటీవలి కాలంలో భారత ఉపఖండంలో భూకంపాలు సర్వసాధారణం అయ్యాయి. పొరుగునే ఉన్న మయన్మార్, థాయ్‌లాండ్‌లల్లో సంభవించిన భూకంపం మిగిల్చిన ప్రాణ, ఆస్తినష్టం అంతా ఇంతా కాదు. నిమిషాల వ్యవధిలో సంభవించిన పెను భూకంపాలు ఈ రెండు దేశాలను కుదిపిపడేశాయి. కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి.
ఈ ప్రకృతి విపత్తు బారిన పడి 3,700 మంది వరకు దుర్మరణం పాలయ్యారు. 5,500 మంది గాయపడ్డారు. అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. పలువురు వాటి శిథిలాల కింద చిక్కుకుని కన్నుమూశారు. భవనాల శిథిలాలను తొలగిస్తోన్న కొద్దీ మృతదేహాలు బయటపడ్డాయి అప్పట్లో.

ఇప్పుడు తాజాగా పొరుగుదేశం పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. ఇప్పటివరకు దీనివల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు ఇంకా తెలియరాలేదు. పలు నివాసాలు బీటలు వారినట్లు సమాచారం అందుతోంది. కొన్ని చోట్ల పాక్షికంగా కూలిపోయినట్లు చెబుతున్నారు.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా రికార్డయింది. ఈ సాయంత్రం సరిగ్గా 4 గంటలకు భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఛిత్రాల్ జిల్లాలో ఈ భూకంపం సంభవించింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి కంపించింది.
ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటుందీ ఛిత్రాల్ జిల్లా. దీని ప్రకంపనలు ఈ రెండు దేశాల్లో నమోదయ్యాయి. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు.
ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. ఆస్తినష్టం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. భౌగోళికంగా- క్రియాశీలక భూకంప ప్రాంతం పాకిస్తాన్. యురేషియన్- ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల పరిధిలోకి వస్తుందీ దేశం. దీని పరిధిలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.
బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, కొన్ని గిరిజన ప్రాంతాలు.. యురేషియన్ ప్లేట్ దక్షిణ అంచున ఉన్నాయి. సింధ్, పంజాబ్ ప్రావిన్స్‌తో పాటు మనదేశంలోని జమ్మూ కాశ్మీర్.. ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్స్ పరిధిలో ఉంటాయి. ఫలితంగా ఈ రీజియన్‌లో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయని సెస్మాలజీ సెంటర్ తెలిపింది.












Click it and Unblock the Notifications