పోప్ ఫ్రాన్సిస్ పార్థివ దేహానికి అంత్యక్రియల తేదీ ఖరార్
Funeral of Pope Francis: గుండెపోటుతో కన్నుమూసిన పోప్ ప్రాన్సిస్ పార్థివదేహానికి ఎప్పుడు అంత్యక్రియలు నిర్వహిస్తారనేది ఖరారైంది. ఈ నెల 26వ తేదీన శనివారం నాడు అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ మేరకు వాటికన్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
88 సంవత్సరాల పోప్ ఫ్రాన్సిస్.. సోమవారం నాడు కన్నుమూసిన విషయం తెలిసిందే. వాటికన్ సిటీ కాలమానం ఉదయం 7:35 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడిన ఆయన కొద్దిరోజుల కిందట ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జ్ అయ్యారు. వాటికన్ సిటీకి చేరుకున్నారు. క్రిస్మస్ పండగలోనూ పాల్గొన్నారు.

ఈస్టర్ సండే నాడు ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించారు కూడా. ఈస్టర్ సండే కార్యక్రమానికి హాజరైన 35,000 మందికి పైగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బసిలికా బాల్కనీ నుండి ప్రసంగించారు. స్వేచ్ఛ, సహనాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో జీసస్ చూపించిన శాంతిమార్గాన్ని అనుసరించాలని కోరారు.
ఆ మరుసటి రోజే ఆయన కన్నుమూశారు. పోప్ ఫ్రాన్సిస్ మరణవార్తతో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారత్ సహా అన్ని దేశాలు కూడా సంతాపాన్ని ప్రకటించాయి. సంతాప దినాలను పాటిస్తోన్నాయి. సంతాప సూచకంగా తమ జాతీయ పతాకాలను అవనతం చేశాయి.
పోప్ ఫ్రాన్సిస్ పార్థివ దేహానికి అంత్యక్రియలను ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై వాటికన్ సిటీ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుు తెలిపింది. భక్తులు నివాళి అర్పించడానికి వీలుగా పోప్ ఫ్రాన్సిస్ పార్థివదేహాన్ని బుధవారం ఉదయం సెయింట్ పీటర్స్ బసిలికాకు తరలిస్తామని వాటికన్ పేర్కొంది.
ప్రస్తుతం అమెరికన్ కార్డినల్ కెవిన్ ఫారెల్.. వాటికన్ సిటీ తాత్కాలిక అధిపతిగా వ్యవహరిస్తోన్నారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ముగిసిన తరువాత కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ సమావేశమౌతుందని తెలుస్తోంది. పోప్ వారసుడిని ఎన్నుకుంటుంది. అప్పటి వరకు కెవిన్ ఫారెల్ బాధ్యతలు నిర్వర్తిస్తారు.












Click it and Unblock the Notifications