10 మంది మృతి: కాలేజీలో కాల్పులకు తెగబడింది ఇతడే
ఓరెగాన్: అమెరికాలోని ఓరెగాన్ యూనివర్సిటిలో ఓ ఉన్మాది సృష్టించిన కాల్పులు కలకలం సృష్టించాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఓరేగాన్ యూనివర్సిటీ పరిధిలోని అంప్‌క్వా కమ్యూనిటీ కాలేజీలో గురువారం ఓ ఉన్మాది విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో 10 మంది విద్యార్ధులు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. కాలేజీలోకి చొరబడిన ఉన్మాది ఒకే తరగతి గదిలో కాకుండా వివిధ తరగతి గదుల్లోకి ప్రవేశించి విద్యార్ధులపై కాల్పులు జరిపాడు. దీంతో తరగతి గదులన్నీ రక్తసిక్తమయ్యాయి. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ సంఘటనకు పాల్పడిన 20 ఏళ్ల వయసున్న దుండగుడు, పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణించాడు. కాల్పుల ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. స్థానిక కాలేజీలో కాల్పుల ఘటనపై మేం వెంటనే స్పందించామని, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారని ఓరేగాన్ రాష్ట్ర పోలీసు అధికార ప్రతినిధి బిల్ ఫుగటె తెలిపారు.
దాదాపు వంద ఎకరాల్లో విస్తరించిన ఈ కాలేజీలో 13,600 మంది విద్యార్థులు చదువుతున్నారని కాలేజీ వెబ్‌సైట్ తెలిపింది. కాలేజీలో కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వెంటనే పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications